
దేశంలో ఇప్పుడు భాషా ప్రియుల ప్రేమ రోజు రోజుకు పెరిగిపోతుంది.. మొన్నటికి మొన్న బెంగళూరులో కన్నడ భాష మాట్లాడలేదని బ్యాంక్ ఉద్యోగిపై దాడి, ఆ తర్వాత బదిలీ చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఇలాంటి ఘటన పెద్ద స్థాయిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని మీరా భయందర్ సిటీ.. ఇది మున్సిపల్ కార్పొరేషన్. పెద్ద నగరమే. ఈ సిటీలో ఓ పెద్ద రెస్టారెంట్ ఉంది. ఇక్కడ యజమాని, అందులో పని చేసే సిబ్బంది హిందీ మాట్లాడుతున్నారు.. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS)కు సంబంధించిన సభ్యులు రెస్టారెంట్ కు వచ్చారు. మా ఊర్లో ఉంటున్నావ్.. ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నావ్.. నువ్వు మరాఠీ భాష ఎందుకు మాట్లాడవు.. హిందీనే ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. పదే పదే వార్నింగ్ ఇచ్చినా యజమాని, సిబ్బంది మరాఠీ భాష మాట్లాడటం లేదనే కోపంతో.. జూలై ఒకటో తేదీన నవ నిర్మాణ సేనకు చెందిన కార్యకర్తలు యజమానిపై దాడి చేశారు. దీనిపై యజమాని వివరణ ఇస్తూ.. మహారాష్ట్రలో అన్ని భాషలు మాట్లాడతారు.. నేను వ్యాపారం చేసుకుంటున్నాను.. మరాఠీ భాష ఒక్కటే మాట్లాడాలి అంటే ఎలా అంటూ చెప్పుకొచ్చాడు.
రెస్టారెంట్ యజమాని వివరణతో మరింత రెచ్చిపోయారు నవ నిర్మాణ సేన కార్యకర్తలు. అన్ని భాషలు మాట్లాడేది ఏంటీ అంటూ యజమానిని చితక్కొట్టారు. రెస్టారెంట్ పై దాడి చేసి కొన్ని వస్తువులు పగలగొట్టారు. యజమానిని చెంపదెబ్బలు కొడుతున్న వీడియో వైరల్ అయ్యింది.
మరాఠీ భాష వివాదంపై మీరా భయందర్ ఏరియాలోని అన్ని రెస్టారెంట్ ఓనర్లు, ఇతర వ్యాపారులు మండిపోతున్నారు. హిందూసేనల పేరుతో ఈ దౌర్జన్యం ఏంటని ప్రశ్నిస్తూ.. దాడులను ఖండిస్తూ ఏకంగా బంద్ కు పిలుపునిచ్చారు. జూలై 3వ తేదీన అన్ని షాపులు మూసివేశారు. మరాఠీ భాష మాత్రమే మాట్లాడాలంటూ దాడులు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. ఇలాగే కొనసాగితే వ్యాపారాలు మూసేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు వ్యాపారులు.
MNS.. నవ నిర్మాణ సేన పేరుతో.. మరాఠీ భాషనే మాట్లాడాలనే బలవంతపు దాడులపై జనం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర అందరిదీ అని.. అన్ని ప్రాంతాల నుంచి జనం వస్తుంటారని.. అలాంటప్పుడు మరాఠీ భాషనే మాట్లాడాలనే ఆంక్షలు విధించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దాడులు కొనసాగితే భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయంటూ జనం నుంచి కూడా నిరసనలు వ్యక్తం కావటం విశేషం.