లెబనాన్‎లో ఇండ్లపై ఇజ్రాయెల్ ఆర్మీ వైట్ ఫాస్ఫరస్ అటాక్

లెబనాన్‎లో ఇండ్లపై ఇజ్రాయెల్ ఆర్మీ వైట్ ఫాస్ఫరస్ అటాక్

యోహ్మోర్: లెబనాన్‌‌‌‌లోని యోహ్మోర్ టౌన్‎లో ఈ నెల 3న నివాస గృహాలపై ఇజ్రాయెల్ సైన్యం చట్టవిరుద్ధంగా వైట్ ఫాస్ఫరస్ మందుగుండు సామగ్రిని ప్రయోగించిందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ (హెచ్ఆర్​డబ్ల్యూ) వెల్లడించింది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమవుతున్న తరుణంలో.. నివాస ప్రాంతాలపై ఇటువంటి మండే స్వభావం గల ఆయుధాలను ఉపయోగించినట్టు తాము ధ్రువీకరించామని ఆ సంస్థ పేర్కొంది. యోహ్మోర్ టౌన్‎లోని ఇండ్లపై వైట్ ఫాస్ఫరస్ విస్ఫోటనాలకు సంబంధించిన ఏడు చిత్రాలను తాము జియో-లొకేట్ చేశామని.. అందులో రెండు ఇండ్లు, ఒక కారు మంటల్లో కాలిపోయినట్టు గుర్తించామని హెచ్ఆర్​డబ్ల్యూ తెలిపింది. 

వైట్ ఫాస్ఫరస్ అంటే ఏమిటి..?

వైట్ ఫాస్ఫరస్ అనేది ఫిరంగి గుండ్లు, బాంబులు, రాకెట్లలో వాడే కెమికల్. ఇది ఆక్సిజన్‌‌‌‌తో కలవగానే మండుతుంది. అయితే, అంతర్జాతీయ చట్టాల  ప్రకారం.. నివాస ప్రాంతాలలో దీనిని వాడటం నిషిద్ధం. ఇది గాలిలో పేలినప్పుడు 125 మీటర్ల నుంచి 250 మీటర్ల విస్తీర్ణంలో బర్నింగ్​ఫెల్ట్​వెడ్జ్​లను వెదజల్లుతుంది. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. సాధారణంగా పొగ తెరలను సృష్టించడం, లక్ష్యాలను గుర్తించడం, సిగ్నలింగ్ చేసి.. శత్రు సిబ్బంది, పరికరాలపై దాడి చేయడం వంటి సైనిక చర్యలలో ఈ వైట్​ఫాస్పరస్‎ను ఎక్కువగా ఉపయోగిస్తారు.