
లివర్‌పూల్ స్టార్, పోర్చుగీస్ ఇంటర్నేషనల్ ప్లేయర్ డియోగో జోటా (28) నిన్న కారు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో అతని సోదరుడు ఆండ్రీ సిల్వా కూడా ఉన్నారు. అయితే సమాచారం ప్రకారం స్పెయిన్‌లోని జమోరా నగరంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:40 గంటల ప్రాంతంలో కారు అదుపుతప్పి మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. విషాదకరమైన విషయం ఏంటంటే డియోగో జోటా కొద్దీ రోజుల క్రితమే తన చిన్ననాటి స్నేహితురాలు రూట్ కార్డోసోను పెళ్లి చేసుకున్నాడు.
ఆండ్రీ సిల్వా కూడా ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. అతను పోర్చుగీస్ 2వ లీగ్‌లో పెనాఫీల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. స్పానిష్ సివిల్ గార్డ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు అన్నదమ్ములు లంబోర్ఘిని కారులో ఉన్నారు. అంతేకాకుండా కార్ ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు టైర్ పేలిపోవడంతో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దింతో కారులో మంటలు వ్యాపించాయి.
"మాకు అందిన సమాచారం ప్రకారం, జమోరా ప్రావిన్స్‌లోని సెర్నాడిల్లా మున్సిపాలిటీలో అర్ధరాత్రి 00:30 BST సమయంలో ఒక లంబోర్ఘిని కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు టైర్ పేలిపోవడంతో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దింతో కారు మంటల్లో చిక్కుకుని, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు" అని ఒక పోలీస్ అధికారి తెలిపారు.
పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ధృవీకరణ: ప్రమాదం గురించి వార్తలు వచ్చిన వెంటనే పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ డియోగో జోటా మరణాన్ని ధృవీకరించింది. ఫెడరేషన్ అధ్యక్షుడు పెడ్రో ప్రోయెంకా మాట్లాడుతూ, డియోగో జోటాతో పాటు అతని సోదరుడు ఆండ్రీ సిల్వా కూడా మరణించారని తెలిపారు.
"స్పెయిన్‌లో డియోగో జోటా అలాగే ఆండ్రీ సిల్వా మరణాలతో పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ సహా మొత్తం పోర్చుగీస్ ఫుట్‌బాల్ నాశనమైంది. జాతీయ జట్టుకు దాదాపు 50 అంతర్జాతీయ మ్యాచ్‌లతో అద్భుతమైన ఆటగాడి కంటే డియోగో జోటా చాలా ఎక్కువ. డియోగో జోటా ఒక అసాధారణ వ్యక్తి. అతని టీంమేట్స్, ఇతర ప్లేయర్లు కూడా ఎంతో గౌరవించే వ్యక్తి" అని పెడ్రో ప్రోయెంకా తెలిపారు.