ఏంటీ.. ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ సినిమానా..? టైటిల్ కూడా బయటపెట్టిన ‘దిల్’ రాజు !

ఏంటీ.. ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ సినిమానా..? టైటిల్ కూడా బయటపెట్టిన ‘దిల్’ రాజు !

‘కేజీఎఫ్’, ‘సలార్’.. ఈ రెండు సినిమాలు హీరో ఎలివేషన్ అనే విషయంలో అప్పటిదాకా ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి. ఎంత ఊర మాస్ సినిమా అయినా ఒకట్రెండు సన్నివేశాల్లో మాత్రమే హీరో అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. కానీ.. ప్రశాంత్ నీల్ సినిమాలో ‘‘ప్రతీ సీన్, ప్రతీ షాట్.. మైండ్ పోతంది లోపల’’ అనే రీతిలో ఎలివేషన్ ఉంటుంది. ఇలాంటి డైరెక్టర్తో ‘పుష్ప’ సినిమాతో దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసిన అల్లు అర్జున్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది.. ఆ ఊహే బన్నీ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తోంది. ఇండస్ట్రీ చూపు మొత్తం ఆ కాంబోపై పడేలా చేస్తోంది. ఈ కాంబోలో సినిమా వస్తుంది. ఇది నిజం. ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్స్లో ఉన్న ‘దిల్’ రాజు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. SVC బ్యానర్లోనే ఈ సినిమా రాబోతోందట.

ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా కంప్లీట్ అయినట్లు టాక్. ఈ సినిమాకు ప్రస్తుతానికి ‘రావణం’ అనే టైటిల్ అనుకున్నట్లు తెలిసింది. ఇప్పటికిప్పుడు ఈ సినిమా ఉండకపోవచ్చు. బన్నీ కమిట్మెంట్స్ బన్నీకి ఉన్నాయి. ప్రశాంత్ నీల్ కమిట్ మెంట్స్ నీల్కూ ఉన్నాయి. కొన్నేళ్లు టైం పట్టినా ఈ ‘రావణం’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని ‘దిల్’ రాజు చెప్పడంతో బన్నీ అభిమానులు ‘ఎక్స్’లో ఎలివేషన్ వీడియోలతో, టైటిల్ పోస్టర్ డిజైన్స్తో రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో ఒక హై బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

సై-ఫై యాక్షన్ సినిమాగా అట్లీ, అల్లు అర్జున్ సినిమా తెరకెక్కుతోంది. దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇక.. ప్రశాంత్ నీల్ విషయానికొస్తే.. జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత.. సలార్-2 చేయాల్సి ఉంది. ఈ సినిమాల తర్వాతే అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ ‘రావణం’ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒక ఐదారేళ్ల తర్వాత ఈ ‘రావణం’ సినిమా షూటింగ్ మొదలై.. 2030 లేదా 2031లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటివరకూ ‘రావణం’ సినిమా అల్లు అర్జున్ అభిమానులకు ఒక హైపెక్కించే సౌండింగ్ మాత్రమే.

►ALSO READ | RC ఫ్యాన్స్ కోపానికి శాంతి చేసిన శిరీష్ రెడ్డి.. ఇకనైనా చల్లబడతారా..?