తిరిగొచ్చిన వ్యోమగాములు..పసిఫిక్ మహాసముద్రంలో ఒరియన్ క్యాప్సూల్ ల్యాండింగ్

తిరిగొచ్చిన వ్యోమగాములు..పసిఫిక్ మహాసముద్రంలో ఒరియన్  క్యాప్సూల్ ల్యాండింగ్

 

        చంద్రుడి ఆవలివైపు భాగాన్ని ఫొటో తీసిన ఆస్ట్రోనాట్లు

 

హ్యూస్టన్: ఆర్టెమిస్ 2 చంద్రుడి యాత్ర విజయవంతంగా పూర్తయింది. ఒరియన్  క్యాప్సూల్ ఆస్ట్రోనాట్లను తిరిగి భూమిపైకి సురక్షితంగా చేర్చింది. కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ డీగో తీరంలోని పసిఫిక్  మహాసముద్రంలో క్యాప్సూల్ దిగింది. క్యాప్సూల్  ల్యాండైన వెంటనే నలుగురు ఆస్ట్రోనాట్లను బయటకు తెచ్చారు. కమాండర్  రీడ్  వైస్ మ్యాన్, పైలట్  విక్టర్  గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన వ్యోమగామి జెరెమి హాన్సన్.. క్యాప్య్సూల్  నుంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. అనంతరం వారిని మిలిటరీ హెలికాప్టర్లలో తరలించారు. ఈ సందర్భంగా నాసా అడ్మినిస్ట్రేటర్  జేర్డ్  ఐసాక్ మ్యాన్  మీడియాతో మాట్లాడారు. భూమి పైనుంచి మానవాళి ప్రతినిధులుగా చంద్రుడిని చుట్టి వచ్చారని వ్యోమగాములను ప్రశంసించారు.

క్షణక్షణం ఉత్కంఠ

ఒరియన్  క్యాప్సూల్  భూవాతావరణంలోకి ప్రవేశించినప్పటి నుంచి పసిఫిక్  మహాసముద్రంలో ల్యాండ్  అయ్యే వరకు క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. శబ్ద వేగానికి 33 రెట్లతో ప్రయాణిస్తూ క్యాప్సూల్ భూవాతావరణంలోకి ప్రవేశించగానే నిప్పులకొలిమిలా మారింది. ఒకానొక దశలో మండుతున్న వాయుగోళంలా కనిపించింది. దీంతో మిషన్  కంట్రోల్ లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. క్యాప్సూల్ మీద ఉన్న లైఫ్ ప్రొటెక్టింగ్ షీల్డ్​ను అంతా ఆందోళనతో గమనించారు. ఎట్టకేలకు క్యాప్సూల్  పసిఫిక్  మహాసముద్రంపై విజయవంతంగా ల్యాండ్  కావడంతో వ్యోమగాములతో పాటు సైంటిస్టులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. చంద్రుడి వైపు ప్రయాణించిన మొదటి మహిళా ఆస్ట్రోనాట్  క్రిస్టినా కోచ్  చరిత్ర సృష్టించారు. అలాగే, పైలట్  విక్టర్  గ్లోవర్  మొదటి బ్లాక్  ఆస్ట్రోనాట్, హాన్సన్  మొదటి అమెరికాయేతర సిటిజన్​గా రికార్డు నెలకొల్పారు. ఆస్ట్రోనాట్లందరూ బయటకు వచ్చాక ఒకరినొకరు కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రపంచానికి థ్యాంక్స్  చెప్పారు. కనిపించని చంద్రుడి భాగాన్ని యాత్రలో ఉన్నప్పుడు వ్యోమగాములు ఫొటో తీసి భూమికి పంపించారు.