గొప్పకవి, ఆధునిక తెలుగు సాహిత్యంలో అసమాన పండిత పరిశోధకులు. కలం పేరునే సొంత పేరుగా అన్వయించుకున్న ఆరుద్ర.. ‘నా జీవితం కమ్యూనిజానికే సొంతం’ అని సగర్వంగా చాటారు. అంతర్జాతీయంగా సోవియట్ విచ్ఛిన్నం ప్రపంచీకరణ, దేశంలో అయోధ్య వివాదం తర్వాత మతతత్వ రాజకీయాలు పెరుగుతున్న సమయంలో ఆరుద్ర మరింత అధ్యయనశీలిగా, పట్టుదలతో తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. వాడుక భాషలో, మార్క్సిస్టు దృక్పథంతో తెలుగు సాహిత్య చరిత్రను సమగ్రాంధ్ర సాహిత్యంగా రాయడమనేది ఆయన ప్రతిభకు తార్కాణం.
పూర్వ సాహిత్య చరిత్రలోని అంశాలను కొత్త సంగతులతో మిళితం చేసి, సరళంగా చెప్పడం ఆయనకే చెల్లింది. ఆరుద్ర మొదలుపెట్టిన ప్రతి ప్రక్రియలో పూర్తిగా మనసు పెట్టి, ప్రతి రచనలో ప్రత్యేకతను అద్దడం ఆయన విశిష్టత.
ఆరుద్ర గురుంచి చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. కవి, రచయిత, సినీ గేయ రచయిత, కాలమిస్టు, సాహిత్య పరిశోధకులు, అభ్యుదయ సాహిత్యోద్యమ ప్రముఖులు.. ఇలా ఎన్నో ఆయన చదివింది ఎస్ఎస్ఎల్సీనే. కానీ సముపార్జించిన జ్ఞానం, సాహిత్యం మాత్రం అంతులేనిది. ఆయన చదువంతా గ్రంథాలయాల్లోనే సాగిందని అనేవారు. ఎందుకంటే గ్రంథాలయ యాత్రలు, పుస్తక పఠనం, పుస్తక సేకరణ, నిత్య అధ్యయనం, రచనలు.. ఇవే ఆయన వ్యాపకాలు. దినచర్య కూడా.
సాహిత్యాభిలాష ఒక్కటే కాక..
జీవితాంతం మార్క్సిజం, కమ్యూనిజం సిద్ధాంతాలను బలంగా విశ్వసించిన వ్యక్తి. తన రచనల ద్వారా నిబద్ధతతో గడిపిన సమోన్నత శక్తి. క్రమంగా ప్రజా ఉద్యమాల్లో భాగమయ్యారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత కూడా కమ్యూనిస్టు భావజాలానికి మరింత పట్టుదలగా నిలబడ్డారు. విప్లవ పోరాటాల ద్వారా సామాజిక మార్పును ఆశించారు.
ఆయన కవిగా, రచయితగా, పరిశోధకుడిగా తన రచనల్లో, జీవితంలో కమ్యూనిస్టు ఆశయాలను ఎంతగానో ప్రతిబింబించారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ‘‘నేనెప్పుడూ కమ్యూనిజానికే సొంతం’’ సంకలనంలో ఆరుద్ర జ్ఞాపకాలు, లేఖలు, ఆయన భార్య రామలక్ష్మి ఇంటర్వ్యూలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆయనకు ఈ సిద్ధాంతం పట్ల ఉన్న నిబద్ధత, స్పష్టత మనకు పుస్తక రచయిత ప్రస్తావించిన విషయాలను చదివాకే మరింత అర్థమవుతోంది.
సినిమా పాటలు రాస్తూ వచ్చిన ఆదాయాన్ని పుస్తకాలు కొనడానికి, పరిశోధన చేసేందుకు ఉపయోగించేవారట. ఆరుద్ర వంటి వ్యక్తి రాయడం వల్లే ఈ చరిత్ర గురించి కాస్త ఆసక్తి ఉన్న చదువరులు సైతం మాట్లాడుకునే అవకాశం కలిగింది. తెలుసుకునే విజ్ఞానం పెరిగింది. దాంట్లో సాహిత్య చరిత్రతో పాటు సామాజిక పరిణామం కూడా ఆయన నిక్షిప్తం చేయడం విశేషం.
అన్ని చారిత్రక ఆధారాలతో ఎవరూ ఆక్షేపించే అవకాశం లేకుండా జాగ్రత్త తీసుకునేవారట ఆరుద్ర. మార్క్సిస్టు దృక్పథంతో అనేక రంగాల్లో సామాజిక పరిణామ చరిత్రను అక్షరబద్దం చేయడానికి ఆయన ఆఖరిదాకా శ్రమించారనడంలో అతిశయోక్తి లేదు.
- పి. రాజ్యలక్ష్మి-
