
యూట్యూబ్‌లో సక్సెస్ రావడం అంత ఈజీ కాదు. కొందరికైతే కొన్నేండ్లు పడుతుంది. కానీ.. ఈ పెద్దాయన యూట్యూబ్ ఛానెల్ పెట్టిన ఆర్నెల్లలోనే ఆరున్నర లక్షలు సంపాదించాడు. 70 ఏండ్ల వయసులో ఇప్పటికీ హుషారుగా వంటలు చేస్తూ.. ఫాలోవర్స్‌ని సంపాదిస్తున్నాడు అరుముగం. ఎప్పటికప్పుడు కొత్త వంటకాలు చేస్తూ.. యంగ్ యూట్యూబర్లకు పోటీ ఇస్తున్నాడు.
అరుముగం ఊరు పశ్చిమ తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర్లోని తిరుప్పూర్. ఈయన వంటలు చాలా బాగా చేస్తాడు. అందుకే అతని కొడుకు గోపీనాథ్‌కు యూట్యూబ్ ఛానెల్ పెట్టాలనే ఐడియా వచ్చింది. అతను అప్పటికే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌లో డిప్లొమా చేశాడు. కెమెరా, ఎడిటింగ్ మీద కాస్త అవగాహన ఉంది. దాంతో ‘‘విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ’’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ మొదలు పెట్టాడు. క్రియేటివిటీతో కంటెంట్ తీయాలి అనుకున్నాడు. అందుకే పంట పొలాల మధ్య తండ్రి అరుముగంతో వంటలు చేయిస్తూ.. వీడియోలు తీసి అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ పెద్దాయన వంటలు చేసే స్టయిల్ చాలామందిని ఆకట్టుకుంది. అందుకే ఛానెల్ ఎంతోమంది ఆదరణ పొందింది. ఛానెల్‌లో పోస్ట్ చేసే వీడియోల్లో అరుముగం హీరో అయితే.. గోపీనాథ్ డైరెక్టర్ అన్నమాట. ఈ ఇద్దరూ ఎప్పుడూ కొత్త కంటెంట్‌తో సబ్స్క్రయిబర్లకు దగ్గరవుతున్నారు. గోపీనాథ్ అన్న మణికందన్ కూడా వీళ్లకు సాయం చేస్తుంటాడు.
మొదటి నుంచే క్రేజ్
వీళ్ల వీడియోలు మొదట్నించే జనాలకు బాగా నచ్చాయి. మొదటి ఆరేడు నెలల్లో చేసిన 42 వీడియోలకు 30 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఛానెల్‌ను 66,000 మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. అప్పటివరకు మామూలుగా పెరుగుతూ వచ్చిన సబ్స్క్రయిబర్ల సంఖ్య మేక గ్రేవీ, 300 గుడ్ల గ్రేవీ వీడియోలతో ఒక్కసారిగా విపరీతంగా పెరిగింది. ఈ రెండు వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత బోటీ గ్రేవీ, రొయ్యల కూర, బాతు కూర వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. కేఎఫ్‌సీ స్టయిల్ చికెన్ వీడియోకు 80 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దాంతో సబ్స్క్రయిబర్స్తోపాటు ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. మొదటగా యూట్యూబ్ నుంచి ఎనిమిది వేల రూపాయలు అందుకున్నారు. ఆ తర్వాత నెల 45 వేలు, మరుసటి నెల లక్షా ఐదు వేల రూపాయలు సంపాదించారు. అలా ఛానెల్ ఆదాయం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 4.7 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. నెలకు ఎనిమది నుంచి 12 లక్షల రూపాయలు వస్తున్నాయి.
సంప్రదాయ పద్ధతుల్లో...
అరుముగం అన్ని వంటలు సంప్రదాయ పద్ధతుల్లోనే చేస్తాడు. అందుకే వాటికి ఎక్కువమంది కనెక్ట్ అయ్యారు. పొలాల నడుమ, పొయ్యి పెట్టి, కట్టెలతో మంట పెట్టి వంట చేస్తుంటాడు. ఆ వంట ఎలా చేయాలనేది చక్కగా వివరిస్తాడు. ఆయన చెప్పే విధానం వల్లే ఆ ఛానెల్‌కు ఎక్కువమంది సబ్‌స్క్రయిబర్స్ వచ్చారు. తమిళం రానివాళ్లు కూడా అరుముగం వీడియోలు చూస్తుంటారు. అలా అరుముగం సోషల్ మీడియాలో ఫేమస్ సెలబ్రిటీ అయ్యాడు. ఎంతోమంది ప్రేమని పొందాడు. ఆ వీడియోల కింద చాలామంది ‘మీ ఆరోగ్యం జాగ్రత్త’, ‘వీడియోల కోసం ఎక్కువగా తినొద్దు’ అని కామెంట్లు పెడుతుంటారు. నాన్నను జాగ్రత్తగా చూసుకోమని గోపీనాథ్‌కి సలహాలు ఇస్తుంటారు.
ఫేమస్
గోపీనాథ్ గోల్ డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు. తండ్రిని ఫేమస్ చేయడం కూడా. అరుముగం ఫ్యామిలీలో అందరూ డబ్బున్నవాళ్లే. అరుముగం మాత్రమే ఆర్థిక ఇబ్బందులు పడేవాడు. అతను బిల్డింగ్స్‌కి పెయింట్స్ వేస్తూ.. అతని భార్య టైలరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించారు. అరుముగం అన్నదమ్ములంతా బాగా సెటిల్ అయ్యారు. అందుకే కుటుంబంలో ఎవరూ అతనిని అంతగా పట్టించుకునేవాళ్లు కాదు. అందుకే వాళ్ల నాన్నను అందరూ గౌరవించేలా చేయాలి అనుకున్నాడు గోపీనాథ్. ఛానెల్ పెట్టిన కొన్ని నెలల్లోనే అతని కల నిజమైంది.
ఎక్స్‌పీరియెన్స్
యూట్యూబ్ ఛానెల్ పెట్టడానికి ముందు గోపీనాథ్ దాదాపు ఐదేండ్లు చెన్నైలో ఉంటూ సినిమా ఇండస్ట్రీలో పనిచేశాడు. ‘అంజలి అన్నియన్ మాట్రుమ్ పసంగ’ అనే తమిళ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. కొన్ని చిన్న సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ కూడా చేశాడు. అందుకే కెమెరా, షూటింగ్ మీద పట్టుంది. పైగా డిప్లొమా పూర్తయిన వెంటనే కొన్నాళ్లపాటు తిరుప్పూర్‌లోని లోకల్ కేబుల్ ఛానెల్‌లో కూడా పనిచేశాడు. అక్కడే ఎడిటింగ్ నేర్చుకున్నాడు.