హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులైన అరుణోదయ నాయకురాలు, సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క, అధ్యక్షుడు బైరాగి మోహన్ లపై అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) కింద నమోదు చేసిన కేసులు ఎత్తేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్సూర్, జంటనగరాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతుల రమేశ్, రాకేశ్డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అణచడానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న విమలక్కపై 2010లో నక్సలైట్ ముద్ర వేసి సమైక్యాంధ్ర పాలకులు పెట్టిన కేసును తలదన్నేలా తెలంగాణ రాష్ట్ర పోలీసులు సరికొత్తగా మావోయిస్టు ముద్ర వేసి ప్రస్తుతం కేసులు నమోదు చేశారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో వారు ఆరోపించారు.
వారిపై ‘ఉపా’తో పాటు ఆయుధాల చట్టం, రాజ్యాన్ని కూల దోసే కుట్ర చేశారనే 120(బీ) కేసులు కూడా ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తాడ్వాయి పోలీసులు విడుదల చేసిన ఎఫ్ఐఆర్ ను బేషరతుగా ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా పాటల గొంతులపై ఉక్కుపాదం మోపాలనే పాలకుల కుట్రలను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల వ్యతిరేకించాలని వారు కోరారు.
