ఢిల్లీ అభివృద్ధికి కేంద్రమే అడ్డంకి: కేజ్రీవాల్

ఢిల్లీ అభివృద్ధికి కేంద్రమే అడ్డంకి: కేజ్రీవాల్
  •     లోక్​సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: కేజ్రీవాల్​
  •     ఆప్ హెడ్ ఆఫీస్​లో ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభం

న్యూఢిల్లీ :  ఢిల్లీ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ విమర్శించారు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. ‘‘ఢిల్లీ ప్రజలంతా నా కుటుంబ సభ్యులే.. మీ అభివృద్ధికి ఏ స్కీమ్ తీసుకొచ్చినా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారు. ఓ సాధారణ వ్యక్తికి ఢిల్లీ అధికారం కట్టబెట్టినందుకు ఇదంతా చేస్తున్నారు. మోహల్లా క్లినిక్​లను బుల్డోజర్లతో కూల్చేశారు’’అని కేజ్రీవాల్ మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికలకు ఆప్ తన ప్రచారాన్ని శుక్రవారం డీడీయూ మార్గ్​లోని పార్టీ హెడ్ ఆఫీస్​లో ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు. 

‘‘పార్లమెంటులోనూ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌ ఉంటే.. ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుంది’’అనేది తమ నినాదం అని చెప్పారు. ‘‘ఆప్ తరఫున బరిలోకి దిగనున్న ఏడుగురు అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించి పార్లమెంట్​కు పంపించాలి. ఇంటింటికీ రేషన్‌‌‌‌‌‌‌‌, వైద్య పరీక్షలు, మెడిసిన్స్ పంపిణీ చేసే స్కీమ్​ను కేంద్రం ఆపేసింది. ఆప్ తీసుకొచ్చిన స్కీమ్​లు, కేంద్రం అడ్డుకుంటున్న తీరును పార్టీ కార్యకర్తలందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’అని సూచించారు. ఎన్నికల క్యాంపెయిన్​లో భాగంగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సంబంధించిన పాంప్లెట్​లను ఆయన ఆవిష్కరించారు. లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో పంజాబ్‌‌‌‌‌‌‌‌లోని మొత్తం 13 ఎంపీ స్థానాలను ఆప్‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకుంటుందని ఆ రాష్ట్ర  సీఎం భగవంత్ మాన్ ధీమా వ్యక్తం చేశారు.