తీహార్ జైలుకా? కస్టడీకా?.. ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టు ముందుకు కేజ్రీవాల్

తీహార్ జైలుకా? కస్టడీకా?.. ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టు ముందుకు కేజ్రీవాల్
  • కవిత దర్యాప్తులో మాదిరిగానే ఈడీ జ్యుడీషియల్ కస్టడీ కోరే చాన్స్

న్యూఢిల్లీ, వెలుగు:  ఢిల్లీ లిక్కర్  స్కాం మనీలాండరింగ్  కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్ 10 రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో తర్వాత ఏం జరుగుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేజ్రీవాల్ ను తిహార్  జైలుకు పంపుతారా లేక ఈడీ తన కస్టడీకి తీసుకుంటుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో విధించిన కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ సందర్భంగా ఈడీ మరోసారి కస్టడీ కోరుతుందా? లేక కవిత విషయంలో అనుసరించినట్లు జ్యుడీషియల్  రిమాండ్  విధించాలని విజ్ఞప్తి చేస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. కాగా, ఢిల్లీ లిక్కర్  స్కామ్  కేసులో కేజ్రీవాల్ ను ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ  గత నెల 21 న ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 తర్వాత రోజున సీబీఐ స్పెషల్  కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు మార్చి 28 వరకు కస్టడీకి అనుమతించింది. అనంతరం మరోసారి కేజ్రీవాల్ ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ.. ఢిల్లీ సీఎం నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని కోర్టుకు నివేదించింది. నిందితుడు  విచారణకు సహకరించడం లేదని, అందువల్ల కస్టడీని పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్  పాలసీలో ఎలాంటి కుంభకోణం జరగలేదని కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపించారు. ఈడీ కస్టడీకి ఎన్ని రోజులు తీసుకున్నా తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం... కస్టడీని ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడిగించింది. మొత్తం 10 రోజుల కస్టడీ ఆదివారంతో ముగియడంతో కేజ్రీవాల్ ను కోర్టు ముందు మరోసారి ప్రొడ్యూస్  చేయనున్నారు. కాగా తన అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్  చేస్తూ కేజ్రీవాల్  ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్  ఇవ్వాలని కోరగా హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పై ఈడీ స్పందన కోరిన ధర్మాసనం... తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది.

కవిత సీన్ రిపీట్

ఢిల్లీ లిక్కర్  స్కామ్  దర్యాప్తులో ఈడీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ కేసులో సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీలు, పొలిటికల్  లీడర్లు ఉండడంతో ఎక్కడా ఒత్తిడికి గురవకుండా దర్యాప్తు కొనసాగిస్తోంది. మనీ లాండరింగ్  కేసులో ఇప్పటి వరకు అరెస్ట్  అయిన ఏ పొలిటిషియన్ కూ బెయిల్ రాకుండా జాగ్రత్త పడుతోంది. మాజీ డిప్యూటీ సీఎం మనీశ్  సిసోడియా, ఎమ్మెల్సీ కవిత, ఆప్  నేత విజయ్ నాయర్, ఇతర సౌత్  గ్రూప్  మెంబర్లకు బెయిల్  దొరకకుండా చూసింది. అయితే, కస్టడీ తర్వాత జ్యుడీషియల్  రిమాండ్ కు పంపడంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాజాగా కవితను అరెస్టు చేసినప్పుడు ఈడీ 10 రోజుల కస్టడీని కోరింది. దీనికి కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ 5 రోజుల కస్టడీ కావాలని కోరగా, 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిబంధనల ప్రకారం  14 రోజుల వరకు కస్టడీ కోరే అవకాశం ఉన్నా వ్యూహాత్మకంగా కవిత 10 రోజుల కస్టడీ ముగియగానే జ్యుడీషీయల్  రిమాండ్  కోరింది. ఇదే మాదిరిగా కేజ్రీవాల్  విషయంలోనూ ఈడీ ఇదే సీన్ ను రిపీట్  చేసింది.