
- ఎస్సై, ఏఎస్సైపై చర్యలకు అవకాశం?
ఎల్బీనగర్, వెలుగు: ఫిర్యాదు చేసి రోజులు గడిచినా కేసు నమోదు చేయకపోవడంతో నాగోల్ ఇన్స్ పెక్టర్‌పై బదిలీ వేటు పడింది. ఎస్సై, ఏఎస్సైను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 6న ఎల్బీనగర్ లోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన గౌతం అనే యువకుడిపై కొందరు దాడి చేశారు. అదేరోజు నాగోల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాధితుడు ఫిర్యాదు చేసినా.. సీఐ పరశురాం నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
అనంతరం ప్రతిరోజూ స్టేషన్‌కు వచ్చి కేసు నమోదు చేయాలని కోరుతున్నప్పటికీ పట్టించుకోలేదు. దీంతో బాధితుడు రాచకొండ సీపీ తరుణ్ జోషిని కలిసి గోడు వెల్లబోసుకున్నాడు. ఘటనపై విచారణకు ఆదేశించిన సీపీ.. కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో సీఐపై బదిలీ వేటు వేశారు. గతంలో కూడా ఇన్స్ పెక్టర్ పరశురాం పలు కేసుల్లో ఇలాగే నిర్లక్ష్యం వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం నాగోల్ ఇన్ చార్జి ఎస్ హెచ్‌వో బాధ్యతలు ఎల్బీ నగర్ డీఐ సుధాకర్‌కు అప్పగించారు. కాగా, బాధితుడు ఫిర్యాదు మేరకు ఈ నెల 21 కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.