
- సోషల్ మీడియాలో 3 పార్టీల జాబితాలు
- అధికారిక ప్రకటనకు వెనుకడుగు
- అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేది వాళ్లేనా?
- లీకులపై మూడు పార్టీల అధ్యయనం
- ఆచి తూచి నిర్ణయం తీసుకొనే చాన్స్
హైదరాబాద్ : వంద రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరేనంటూ సోషల్ మీడియాలో జాబితాలు వైరల్ అవుతున్నాయి. రేపో, మాపో అధికారిక ప్రకటన వెలువడబోతోందంటూ కొందరి పేర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇంతకు వీళ్లకు టికెట్లు వచ్చినట్టేనా..? బరిలో వీళ్ల నిలుస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే వాటిని పట్టించుకోవద్దని కొన్ని కాంగ్రెస్ కొట్టి పారేస్తుంటే.. మిగతా పార్టీలు జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నాయి. పార్టీల ఆఫీసుల నుంచే లీకులు వెళ్లాయా..? అనే చర్చ మరో వైపు సాగుతోంది. నిజంగానే జాబితా రెడీ అయితే రిలీజ్ చేసేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నాయనే చర్చకూడా మరో వైపు సాగుతోంది. ఇప్పుడే పేర్లు ప్రకటిస్తే.. టికెట్ ఆశించిన వారు పార్టీ మారి నష్టం చేకూర్చుతారా..? అన్న కోణం కూడా రాష్ట్ర నాయకత్వాలను వెంటాడుతున్నది. బీఆర్ఎస్ పార్టీ 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. వాళ్లెవరనేది తెలియడం లేదు. రెండు మూడు రకాల జాబితాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టికెట్ దక్కనుందంటూ వచ్చిన కథనాల క్లిప్పింగులను సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఫేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్ లో షేర్ చేస్తున్నారు. దీనికి వాళ్ల అనుచరులు అభినందనలు కూడా చెబుతున్నారు. ఒక అడుగు ముందుకేసి కొందరైతే ఏకంగా స్వీట్లు పంచుకుంటున్నారు.
అపాయింట్ మెంట్ ఇవ్వలేదా..? ఔట్
టికెట్లపై అనుమానాలున్న ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ బాట పడుతున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ అపాయింట్ మెంట్ కోం వేచి చూస్తున్నారు. అపాయింట్ మెంట్ రాకుంటే టికెట్ రానట్టేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఓ వైపు దరఖాస్తులు మరో వైపు లిస్ట్..!
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డిఫరెంట్ గా ఉంది.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు పీసీసీ శ్రీకారం చుట్టింది. ఓ వైపు దరఖాస్తులు స్వీకరిస్తుండగానే.. మరో వైపు సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. టికెట్ దక్కుతుందని ప్రచారం జరుగుతున్న వారిలో మాజీ మంత్రులు, ఎంపీలతోపాటు కొత్త ముఖాల పేర్లు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు గతంలో ఎంపీగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి అసెంబ్లీ బరిలో నిలుస్తారని ఆ జాబితాల్లో ఉంది..
బీజేపీలోనూ అదే సీన్
బీజేపీ జాబితా కూడా సోషల్ మీడియాకెక్కింది. ఎంపీలు అర్వింద్, బండి సంజయ్, సోయం బాపురావు, బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సారి అసెంబ్లీ బరిలో నిలుస్తారన్నది ఆ జాబితా తెలిపిన సారాంశం. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఈ సారి మహబూబ్ నగర్ లేదా నారాయణపేట నుంచి పోటీ చేసే చాన్సున్నట్టు లిస్ట్ లో ఉంది. మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ గద్వాల నుంచి బరిలోకి దిగుతారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి , ఆయన సతీమని జమున హుజూరాబాద్ నుంచి బరిలోకి దిగుతారని జాబితాలో పేర్కొన్నారు. ఈ జాబితాలను ఎవరు రిలీజ్ చేశారు..? ఎందుకు రిలీజ్ చేశారు..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.