బిడ్డ కాలు విరగడంతో భుజాలపై మోసుకెళ్లి పరీక్ష రాయించిన తండ్రి

బిడ్డ కాలు విరగడంతో  భుజాలపై మోసుకెళ్లి పరీక్ష రాయించిన తండ్రి

హైదరాబాద్/మెదక్ టౌన్/ఖమ్మం రూరల్/హుస్నాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ఫస్టియర్ సెంకడ్ లాంగ్వేజీ పరీక్షలు జరిగాయి. పరీక్ష రాసేందుకు పలువురు విద్యార్థులు అవస్థలు పడ్డారు. చాలా మంది వివిధ కారణాలతో ఎగ్జాం సెంటర్లకు సకాలంలో చేరుకోలేక పరీక్ష రాయలేకపోయారు. బిడ్డ కాలు విరగడంతో ఆమెను భుజాలపై రెండో అంతస్తుపైకి మోసుకెళ్లి పరీక్ష రాయించాడో తండ్రి. మెదక్ పట్టణానికి చెందిన ఇంటర్ స్టూడెంట్ శ్రీవర్ష కాలు విరిగింది. టీఎస్ఎస్ఆర్​డబ్ల్యూజేసీలో ఎగ్జామ్ సెంటర్ ఉండటంతో తండ్రి వెంకటేశం పొద్దున్నే ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు. పరీక్షా కేంద్రం రోడ్డు నుంచి అర కిలో మీటర్ దూరం లోపలికి ఉండటంతో వీల్​చైర్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరాడు. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక రోడ్డు నుంచి ఎగ్జామ్ సెంటర్​ దాకా భుజాలపై మోసుకెళ్లాడు. అక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్​లో ఉన్న ఎగ్జామ్​ హాల్​లోకి తీసుకెళ్లేందుకు అధికారులు ముందు అనుమతివ్వలేదు. ఇందుకోసం స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత పంపించడంతో రెండు అంతస్తులపైకి మోసుకెళ్లి శ్రీవర్షను హాల్​లో దింపాడు.    

వేరే సెంటర్ కు తీస్కెళ్లిన ‘గూగుల్’ 

గూగుల్ మ్యాప్.. ఓ ఇంటర్ స్టూడెంట్​ను పరీక్షకు దూరం చేసింది. తన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో తెలియక గూగుల్ మ్యాప్​ను నమ్ముకున్న ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. కొండాపురానికి చెందిన కొండా వినయ్ ఖమ్మంలోని ఆర్జేసీ కాలేజీలో చదువుతున్నాడు. అదే సిటీలోని ఎన్ఎస్పీ ప్రభుత్వ స్కూల్​లో ఎగ్జామ్ సెంటర్ పడింది. అదెక్కడో తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్​లో నావిగేషన్ పెట్టుకుని బయల్దేరాడు. అది మరో లొకేషన్​కు తీసుకెళ్లింది. అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ తన అసలు సెంటర్​కు చేరుకున్నాడు. 27 నిమిషాలు లేట్ కావడంతో ఎగ్జామ్ రాసేందుకు అనుమతివ్వలేదు.  

ఉరికొచ్చినా టైంకి చేరలే 

సిద్దిపేట జిల్లా రామవరం, మంచినీళ్లబండకు చెందిన నలుగురు విద్యార్థులు హుస్నాబాద్ లోని సెంటర్ లో ఎగ్జాం రాయాల్సి ఉంది. ప్రాజెక్టు వాహనాల వల్ల రామవరం నుంచి హుస్నాబాద్ రూట్లో సాధారణ వెహికల్స్ ఆగిపోయాయి. దీంతో ఇద్దరు విద్యార్థులు సకాలంలో చేరుకోలేక పరీక్ష రాయలేకపోయారు. మరో ఇద్దరు కూడా ఇన్ టైంలో చేరుకోలేకపోయారు.