ఎండల తీవ్రత.. పెరిగిన  ఏసీ, కూలర్ల సేల్స్

ఎండల తీవ్రత.. పెరిగిన  ఏసీ, కూలర్ల సేల్స్

ఎండల తీవ్రత పెరగడంతో...  ఏసీ, కూలర్ల సేల్స్ బాగా పెరిగాయి.  వారం రోజుల్లో కూలర్ల డిమాండ్ విపరీతంగా పెరడంతో.. వాటిని సప్లై చేయడంలో వ్యాపారులు బిజీబజీగా మారారు. ఐతే గత రెండేళ్లుగా కరోనా ఎఫెక్ట్ ... ముడి సరుకుల ధరలు పెరగడంతో కూలర్ల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.  రేట్లు బాగా పెరగడంతో.. కూలర్లు కొనుగోలు చేసే వారికి భారం తప్పడంలేదు.

రాష్ట్రంలో మార్చి రెండో వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండలు తట్టుకోలేక ఏసీ, కూలర్ల షాపులకు క్యూ కడుతున్నారు. బ్రాండెడ్ తో పాటు స్థానికంగా కూలర్ల తయారీ చేసి అమ్ముతున్నారు వ్యాపారులు. ఫిబ్రవరి నుంచే  షాపుల్లోకి పెద్దమొత్తంలో కూలర్లను తీసుకొచ్చి అమ్మడానికి రెడీగా ఉంచారు. 

ఎండలు పెరగటంతో..  కొద్ది రోజులుగా  కూలర్ల సెల్స్ మొదలయ్యాయి.  సహజంగా  ఏప్రిల్ నెలలో  కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఏప్రిల్ నెల మొత్తం పెద్ద మొత్తంలో  కూలర్లు అమ్ముతుంటారు. మే రెండో వారం నాటికి సెల్స్ తగ్గుతుంటాయి. ఆ తర్వాత కొద్ది మొత్తంలోనే కూలర్లు కొంటారు.  కానీ ఈ సారి ఆ పరిస్థితి మారిపోయింది.  మార్చి రెండో వారం నుంచే కూలర్ల అమ్మకాలు జరుగుతున్నాయి.  గతేడాది ఈ సమయంతో  పోలిస్తే.. వీటి అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

గత రెండేళ్లుగా  కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలా వరకూ  ఇళ్లకే పరిమితమయ్యారు జనం. కూలర్లు తయారు చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు.. కరోనా ఎఫెక్ట్ తో సొంతూళ్లకు వెళ్లిపోయారు. థర్ట్ వేవ్ తీవ్రత తగ్గిపోవడంతో వారంతా తిరిగి కూలర్ల తయారీ కోసం వచ్చారు. ఈ ఏడాది కోసం కూలర్లు రెడీ చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా కూలర్స్ షాపులు రద్దీగా మారాయి. ఐతే గతంలో 4 వేల వరకూ వచ్చే కూలర్ ఇప్పుడు 5 నుంచి 6 వేల రూపాయలకు ధర పెరిగిందని చెబుతున్నారు.

కరోనా, లాక్ డౌన్ లాంటి ఎపెక్ట్ లతో ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని చెబుతున్నారు వ్యాపారులు. ఈ ఏడాది అమ్మకాలు ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐతే కూలర్లు తయారు చేసే ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయంటున్నారు. దీంతో కూలర్ల ధరలు పెంచాల్సి వస్తోందంటున్నారు. ఇది అమ్మకాల పై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చిలోనే ఈరేంజ్ లో ఎండలు ఉంటే.. ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం. ఈ వేడి నుంచి బయటపడాలంటే కూలర్స్ ఉండాల్సిందేనని అంటున్నారు.