సంస్థాగత బలోపేతంపై  బీజేపీ దృష్టి 

సంస్థాగత బలోపేతంపై  బీజేపీ దృష్టి 
  • టూర్‌‌‌‌లో పాల్గొననున్న సంజయ్, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, వివేక్, ఎంపీలు, ఎమ్మెల్యేలు
  • సెగ్మెంట్‌‌కో స్టేట్ లీడర్.. రోజుకు 8 గ్రామాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హడావుడి ఊపందుకోవడంతో బీజేపీ అన్ని నియోజకవర్గాల్లో సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి ‘జనం గోస.. బీజేపీ భరోసా’ పేరుతో బూత్ స్థాయిలో బైక్ ర్యాలీలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నది. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. మోడీ సర్కార్ చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ బలోపేతంపై కార్యకర్తలతో చర్చించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ ర్యాలీలు నిర్వహించనుంది. మొదటి విడతగా 30 ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఒక్కో రాష్ట్ర స్థాయి ముఖ్య నేత ఒక్కో నియోజకవర్గంలో పర్యటించేలా, రోజుకు 8 గ్రామాలు తిరిగేలా ప్లాన్ చేస్తున్నది. ఈ జాబితాలో రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్ప సీనియర్ నేతలంతా ఉంటారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, అర్వింద్, సోయం బాపురావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్, పార్టీ సీనియర్ నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మురళీధర్ రావుతోపాటు రాష్ట్ర ఆఫీసు బేరర్లు ఉండనున్నారు. ఏ నియోజకవర్గానికి ఏ నేత వెళ్లనున్నారనేది మరో రెండు, మూడు రోజుల్లో పార్టీ ప్రకటించనుంది. ప్రస్తుతం దీనిపైనే కసరత్తు చేస్తున్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో లక్ష్మణ్, ఇంద్రసేనా రెడ్డి, ఇతర సీనియర్ నేతలు 
సమావేశమై జాబితాపై చర్చించారు.

ఆగస్టు 2 కల్లా ముగింపు

రోజుకు 8 గ్రామాల చొప్పున.. ఆ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని టచ్ చేసేలా,  కనీసం 10 నుంచి 15 రోజులపాటు నేతలు పర్యటించేలా రూట్ మ్యాప్‌‌ను బీజేపీ సిద్ధం చేస్తున్నది. ఈ లెక్కన ఒక్కో నేత ఆ నియోజకవర్గంలోని కనీసం 80 నుంచి 100 గ్రామాలు బైక్‌‌పైనే కార్యకర్తలతో కలిసి తిరగనున్నారు. ఆగస్టు 2 లోపు ఈ ప్రోగ్రామ్ ముగించాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో పాల్గొనే నేతలు కేవలం బైక్‌‌లను మాత్రమే వాడాలని, కార్లను వాడవద్దని కేంద్ర నాయకత్వం కచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే.. అక్కడ ఎలక్షన్స్‌‌కు ముందు సెంట్రల్ పార్టీ ఇలాంటి ప్రోగ్రామ్‌‌లను ఆయా రాష్ట్ర పార్టీలతో చేయిస్తుంది. జనంలోకి బీజేపీ వెళ్లేందుకు వీలుగా, వారి సమస్యలను తెలసుకోవడంతో పాటు బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేయవచ్చని హైకమాండ్ 
ఈ నిర్ణయం తీసుకుంది.