ఎండలు దంచికొడుతుండటంతో సిటీలో ఎక్కువైన నీటి వాడకం

ఎండలు దంచికొడుతుండటంతో సిటీలో ఎక్కువైన నీటి వాడకం

హైదరాబాద్, వెలుగు: ఎండలు మండుతుండటంతో సిటీలో నీటి వాడకం పెరిగింది. బోర్లు ఎండిపోతుండటంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడింది. మరో వైపు హోలీ పండుగ, సిద్ధిపేటలో గోదావరి తాగు నీటి పైపులైన్ పనుల కారణంగా 2 లక్షలకుపైగా ఇండ్లకు ఈ  నెల 9,10,11 తేదీల్లో నీటి సరఫరా ఉండదని ముందుగానే వాటర్ బోర్డు ప్రకటించడంతో ట్యాంకర్లకు మరింత డిమాండ్ ఏర్పడింది. అయితే, ఇదే అదునుగా ప్రైవేటు ట్యాంకర్ల ఆపరేటర్లు దోపిడీకి పాల్పడుతున్నారు.

డైలీ 3 వేలకు పైగా ఆర్డర్లు

ప్రస్తుతం సిటీలో 560 ఎంజీడీల నీటి డిమాండ్ ఉంది. డైలీ డిమాండ్ కి సరిపడా నీరు సరఫరా కాకపోవడం, కొన్నిచోట్ల అరకొరగా అవుతుండటంతో జనం వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకొంటున్నారు. వాటర్​బోర్డు పరిధిలో డైలీ 3 వేలకి పైగా వాటర్ ట్యాంకర్లకు ఆర్డర్లు వస్తున్నాయి. మాదాపూర్, సైనిక్ పురి, హైదర్ నగర్, కుత్బుల్లాపూర్, మణికొండ, కూకట్ పల్లి, సికింద్రాబాద్, సీతాఫల్ మండి, ఎల్‌‌‌‌ బీనగర్, ఎస్​ఆర్ నగర్,  గోషామహల్, పటాన్ చెరు, నారాయణగూడ, నిజాంపేట, నానక్ రాంగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల కోసం ఎక్కువగా బుక్కింగ్స్​వస్తున్నాయి. 

రూల్స్ గాలికొదిలేసి..

ఇదే అదునుగా ప్రైవేట్​ట్యాంకర్ల దోపిడీ సాగుతోంది. వాటర్​బోర్డు​అందించే 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్ కు రూ.500 వసూలు చేస్తుండగా, కమర్షియల్ కేటగిరీ ట్యాంకర్లకు రూ.850 వసూలు చేస్తోంది. అయితే స్థానికంగా వాటర్ బోర్డు ట్యాంకర్లు ఆలస్యంగా వస్తుండటంతో చాలామంది ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. ప్రైవేటు ట్యాంకర్లు విధిగా వాటర్​బోర్డులో నమోదు చేసుకోవాలని, సూచించిన రేటుకే నీటిని సరఫరా చేయాలనే రూల్ ను పట్టించుకోవడం లేదు. 5 వేల లీటర్ల ట్యాంకర్లకు రూ.వెయ్యి నుంచి-1500 వసూలు చేస్తుండగా, కమర్షియల్ కేటగిరీలో దొరికే 10 వేల లీటర్ల ట్యాంకర్ కు కనీసం రూ.2,500 నుంచి 3వేల వరకు దండుకుంటున్నారు.

వాటర్​బోర్డు సిబ్బంది సైతం..

వాటర్​బోర్డ్ సరఫరా చేస్తున్న ట్యాంకర్లకు కూడా కొందరు సిబ్బంది అధికంగా వసూల్ చేస్తున్నారు. 5 వేల లీటర్ల డొమెస్టిక్ ట్యాంకర్​కు రూ.600 నుంచి రూ.750 వరకు వసూల్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్యాంకర్ ఖాళీ చేసిన తర్వాత ఎక్కువ ఇవ్వాల్సిందేనని జనంతో గొడవకు దిగుతున్నారు. ఇవ్వకపోతే మరోసారి తొందరగా తీసుకురాబోమని హెచ్చరిస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో వారికి అదనంగా ఇస్తున్నారు.

ఎక్కువ డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి

వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకున్న తర్వాత ఆపరేటర్ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే 155313 కస్టమర్ కేర్ కి కాల్​చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. లేకపోతే స్థానిక డివిజన్ ఆఫీసులోని అధికారులకు నేరుగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు.

48 గంటల్లో పనులు పూర్తి చేస్తం: వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్

సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద   నిర్వహించాల్సిన పైప్ లైన్ పనులకు సంబంధించి  సోమవారం సంబంధిత అధికారుల‌‌‌‌తో వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  హోలీ పండగ నేపథ్యంలో సిటిజన్లకు నీటి ఇబ్బంది రాకుండా ఈ నెల 8 నుంచి ప్రారంభం కావాల్సిన పనులను 9వ తేదీకి వాయిదా వేశామన్నారు.  9న ఉద‌‌‌‌యం 6 గంట‌‌‌‌ల నుంచి పనులు మొదలుపెట్టి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు 48 గంటల్లో పూర్తి చేస్తామన్నారు. పైప్ లైన్ పనుల కారణంగా సిటీలోని పలు ప్రాంతాల్లో  నీటి సప్లయ్ కు  అంత‌‌‌‌రాయం ఉంటుందని.. వాటర్ బోర్డు జీఎంలు వారి ప‌‌‌‌రిధిలో యాక్షన్  ప్లాన్ రూపొందించుకోవాల‌‌‌‌న్నారు. ఏయే ప్రాంతాలు, ఎన్ని క‌‌‌‌నెక్షన్లు ప్రభావిత‌‌‌‌మ‌‌‌‌వుతాయో రిపోర్టు త‌‌‌‌యారు చేసుకోవాల‌‌‌‌న్నారు. దానికి అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సప్లయ్ కు ప్లానింగ్ చేసుకోవాలని ఆయన  సూచించారు.  24 గంట‌‌‌‌లూ ట్యాంక‌‌‌‌ర్ల ద్వారా నీటి సప్లయ్ కు సిద్ధంగా ఉండాల‌‌‌‌న్నారు. సిటిజన్లు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు. 


ఈ  ప్రాంతాలకు ఎఫెక్ట్...

పైప్​లైన్​ రిపేర్​ పనుల కారణంగా కుత్బుల్లాపూర్​లోని  షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, మల్కాజిగిరి, అల్వాల్ లోని  డిఫెన్స్ కాలనీ, నాగారం, దమ్మాయి గూడ, కీసర, బొల్లారంలోని రింగ్ మెయిన్- 3 పరిధిలోని ఏరియాలు, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కాప్రా మున్సిపాలిటీ పరిధిలో అంతరాయం ఏర్పడనుంది. ఎస్ఆర్​నగర్​, బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ , ఎర్రగడ్డ, అమీర్ పేట, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, మలేషియా టౌన్ షిప్, శేరిలింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు ఉన్న ప్రాంతాలు, గోపాల్ నగర్, మయూర్ నగర్ , నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి ప్రాంతాల్లో పాక్షిక అంతరాయం ఏర్పడనుంది.