ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య వివాదం చర్చలతోనే పరిష్కారమని, మధ్యవర్తిత్వం చేయడానికి తాము సిద్ధమేనన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రస్తుతం జరుగుతున్న రక్తపాతాన్ని ఆపడమే అత్యంత ముఖ్యమైన విషయమని చెప్పారు. అయితే హమాస్ చేస్తున్న క్రూరమైన దాడుల నుంచి రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉందన్నారు. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు పుతిన్. హమాస్ మిలిటెంట్ల దగ్గర బంధీలుగా ఉన్న తమ దేశస్తులను విడిపించుకోవడానికి గాజాలో... ఇజ్రాయెల్ స్పెషల్ ఆపరేషన్ కు సిద్ధమవుతుందన్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్ పెద్ద ఎత్తున ప్రాణ నష్టానికి దారి తీసే అవకాశం ఉందన్నారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా వార్ లో ఇప్పటిదాకా రెండువైపులా 4,330 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో 1530 మంది.. హమాస్ దాడుల వల్ల ఇజ్రాయెల్ లో 1300 మంది మరణించారు. తమ దేశంలో 1500 మంది హమాస్ మిలిటెంట్ల డెడ్ బాడీలను గుర్తించామని ఇజ్రాయెల్ ఇదివరకే ప్రకటించింది. దీంతో శుక్రవారం నాటికి ఈ యుద్ధంలో మృతుల సంఖ్య 4 వేలు దాటింది.
అక్టోబర్ 6వ తేదీన పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై దాడులకు దిగిన విషయం తెలిసిందే. 20 నిమిషాల్లో 5 వేలకుపైగా రాకెట్లతో హమాస్ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. హమాస్‌ను నామరూపాల్లేకుండా చేయాలనే లక్ష్యంతో దాడలు చేస్తోంది.ఇరువైపుల భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతోంది.
