బీజేపీ, ప్రధాని మోడీపై అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు

బీజేపీ, ప్రధాని మోడీపై అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు

న్యూఢిల్లీ : షాజహాన్ తాజ్ మహల్ కట్టకపోయుంటే ఈ రోజు లీటర్ పెట్రోల్ రూ.40కే లభించేదని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీ, ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ఆయన ఈ సెటైర్ వేశారు. దేశంలో నెలకొన్న సమస్యలన్నింటికీ మొఘల్ పాలకులు, ముస్లింలే కారణమన్నట్లుగా బీజేపీ నాయకులు, ప్రధాని మోడీ మాట్లాడుతున్నారని ఒవైసీ మండిపడ్డారు. ద్రవ్యోల్బణానికి, లీటర్ డీజిల్ ధర రూ.102కు చేరడానికి ఔరంగజేబు కారణం తప్ప ప్రధాని మోడీ కాదని ఒవైసీ చురకలంటించారు. నిరుద్యోగానికి అక్బర్ కారణమైతే.. లీటర్ పెట్రోల్ ధర రూ.115కు చేరడానికి తాజ్ మహల్ కారణమని ఒవైసీ వ్యంగంగా అన్నారు.

తాజ్ మహల్, ఎర్రకోటను నిర్మించి షాజహాన్ తప్పు చేశాడని, ఆ డబ్బును ఆదా చేసి 2014లో మోడీ వస్తాడని ఆయనకు ఆ సొమ్ము అప్పజెప్పమని చెప్పుంటే బాగుండేదని విమర్శించారు. భారత్ ను కేవలం మొఘల్స్ మాత్రమే పాలించారా? అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు పాలించలేదా అని ప్రశ్నించారు. బీజేపీకి మొఘలులు మాత్రమే ఎందుకు కనిపిస్తారని నిలదీశారు.


భారత ముస్లింలకు మొఘలులతో, పాకిస్తాన్‌తో సంబంధం లేదని ఒవైసీ స్పష్టం చేశారు. మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనను తాము తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. జిన్నా ప్రతిపాదనను తిరస్కరించి భారత్‌లోనే ఉండిపోయిన తరాల వారసులే ఇప్పటి ముస్లింలని అన్నారు.