
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని ‘ఫాదర్ ఆఫ్ ఇండియా‘ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొగడడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. జాతి పిత మహాత్మ గాంధీతో ప్రధాని మోడీని ఎలా పోలుస్తారని ఆయన ప్రశ్నించారు.
దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహాత్ముడిని జాతి పితగా దేశమంతా పూజిస్తోందన్నారు. ఆ బిరుదు ఒకరు ఇస్తే వచ్చేది కాదని, సాధించుకునేదని ఒవైసీ చెప్పారు. ట్రంప్ ఒక ఇల్లిటరేట్ అని, భారతదేశ చరిత్ర గానీ, స్వాతంత్ర్య పోరాటం గురించి కానీ ఏమాత్రం తెలియదని అన్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానేతలను సైతం ఎప్పుడూ జాతి పిత అని పిలవలేదని ఒవైసీ గుర్తు చేశారు.
ట్రంప్ చేసిన ‘ఫాదర్ ఆఫ్ ఇండియా’ కామెంట్స్ విషయాన్ని మోడీ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఒవైసీ అన్నారు. మోడీని గాంధీజీతో పోల్చడాన్ని తాను అంగీకరించబోనని చెప్పారు. ఇక ఆ సమయంలో ట్రంప్ ఏమన్నారనే దానిపై మోడీ వివరణ ఇవ్వాలని అన్నారు.
ఇది ట్రంప్ మైండ్ గేమ్
మరోవైపు ట్రంప్ డబుల్ గేమ్ అడుతున్నారని ఒవైసీ అన్నారు. ఇటు మన ప్రధాని మోడీని, అటు పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ ను పొగడుతూ ట్రంపై మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారని అన్నారు. దీనిని మనం గుర్తించాలని చెప్పారు.
మోడీ మాటలతో మైమరిపిస్తరు..
ఇక మోడీని ట్రంప్ అమెరికా రాక్ స్టార్ ఎల్విస్ తో పోల్చడంపైనా ఒవైసీ స్పందించారు. ఈ పోలికలో కొంత నిజం ఉందని ఆయన ఒప్పుకున్నారు. ఎల్విస్ పాటలతో మైమరిపింపచేస్తే, మోడీ ప్రసంగాలతో జనాల్ని మైమరిపింపచేస్తరని ఒవైసీ చెప్పారు.