ఆశాలతో హిమోగ్లోబిన్ టెస్టులు

ఆశాలతో హిమోగ్లోబిన్ టెస్టులు
  • ఆశాలతో హిమోగ్లోబిన్ టెస్టులు
  • సరైన ట్రైనింగ్​ లేక ఇబ్బందులు 
  • పాత పద్ధతితో రిస్క్​
  • ఒత్తిడికి గురవుతున్న వర్కర్లు 

కరీంనగర్, వెలుగు: ఇప్పటికే చాలా పనులతో సతమతమవుతున్న  ఆశా కార్యకర్తలకు సర్కారు మరో బాధ్యత అప్పగించింది. గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికల ఆరోగ్యాన్ని పరిశీలించడం, సకాలంలో టీకాలు.. మెడికిల్ చెకప్ జరిగేలా చూడడం, ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవాల సంఖ్య పెంచడం ఆశల డ్యూటీలు. వీటితోపాటు సర్వేలు తదితర పనులు చేస్తున్న ఆశ వర్కర్లతో గ్రామాల్లో మహిళలు, బాలికల బ్లడ్ శాంపిల్స్​ తీసి హిమోగ్లోబిన్​ పరీక్షలు చేయిస్తోంది. డిజిటల్​ పరికరాలకు బదులు పాత పద్దతుల్లో పరీక్షలు చేయిస్తుండడం, తగిన ట్రైనింగ్​ లేకపోవడంతో ఆశ వర్కర్లు ఆందోళన చెందుతున్నారు.  


 ట్రైనింగ్​ లేకుండానే టెస్టులకు పంపిన్రు


15 ఏండ్ల నుంచి 49 ఏండ్ల మధ్య వయసున్న బాలికలు, మహిళల్లో రక్తహీనత తెలుసుకునేందుకు కరీంనగర్​ జిల్లాలో ఆశా కార్యకర్తలతో హిమోగ్లోబిన్(హెచ్ బీ)  టెస్టులు చేయిస్తున్నారు. గతంలోనూ ఈ టెస్టులను  పీహెచ్ సీ ల్లో ల్యాబ్ టెక్నిషియన్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఆశా కార్యకర్తలకు రూ.2,500 విలువైన ప్రత్యేక కిట్లు ఇచ్చారు.  టెస్టులు ఎలా చేయాలో ఇటీవల ఒక మీటింగ్ పెట్టి తూతూమంత్రంగా చెప్పారు. వీటిని పట్టుకుని వెళ్లిన ఆశ వర్కర్లు   ఫీల్డ్ లో   ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  వారికి గతంలో ఇలాంటి టెస్టులు చేసిన అనుభవం లేదు. శాంపిల్​ తీసుకోవడం కూడా చాలామందికి తెలియదు. రక్తం సేకరించేటపుడు పైపు ద్వారా నోటితో పీల్చాల్సిఉంటుంది. ఈ టైమ్ లో ఏమాత్రం జాగ్రత్త లేకపోయినా రక్తం పైకి వచ్చే అవకాశం ఉంది.  టెస్ట్ ట్యూబ్ లో  కొంత మోతాదులో  హైడ్రో క్లోరిక్ ఆమ్లం వేసి..  సేకరించిన రక్తం శాంపిల్ ను అందులో కలిపి షేక్ చేయాలి.  ట్యూబ్ ను  సాహిల్ పరికరంలో పెట్టి .. పరికరంలో చూపిన కలర్​లోకి రక్తం మారే వరకు డిస్టిల్ వాటర్ ను చుక్కలు చుక్కలుగా కలుపుతూ ఉండాలి. ఈ ప్రక్రియలో కొంత తప్పు జరిగినా హిమోగ్లోబిన్ శాతంలో తేడా వస్తుంది.  

టెస్టు ట్యూబ్ లో  కెమికల్స్ మిక్స్ చేయడం, రంగులు పరిశీలించడం  ఇబ్బందిగా మారుతోంది. అన్ని పూర్తి చేసినా ఫోన్  యాప్ లో ఆధార్​, రిపోర్ట్​ను అప్ లోడ్ చేయడం కూడా ఇబ్బందిగా మారుతోంది. ఒక్కోసారి  నెట్ వర్క్ సమస్యలు తలెత్తుతున్నాయి. సరైన ట్రైనింగ్ లేకపోవడంతో  ఒక్కో టెస్ట్​ చేయడానికి 15 నుంచి 20 నిమిషాల టూమ్​ పడుతోంది.  రోజుకు 20 శాంపిల్స్ తీయాలని టార్గెట్  పెట్టినా  10 లోపే చేస్తున్నారు.    ఒక్కో ఆశావర్కర్  రోజుకు  20 మంది చొప్పున  రెండు నెలరోజుల్లో గ్రామంలో   ఉన్న అందరికి  పరీక్షలు చేయాలని ఆధికారులు ఆదేశించారు. జీతాలు రావాలంటే రెగ్యులర్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది.  సరైన శిక్షణ లేకపోవడంతో ఎక్కువ టైమ్​ ఈ టెస్టులకోసమే కేటాయిస్తున్నారు. దీంతో ఇతర పనుల్లో వెనకబడిపోతుండటంతో రిపోర్టుల కోసం అధికారులనుంచి వేధింపులు పెరుగుతున్నాయి. ఈపనులతో మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతున్నట్టు వాపోతున్నారు. 

గ్లౌజులు, కాటన్​ ఇయ్యలే


పిప్పెట్ గాజు గొట్టం ద్వారా సేకరించిన రక్తాన్ని టెస్టు ట్యూబ్ లోకి వదిలేస్తారు.  మరో వ్యక్తికి టెస్టు చేయాల్సి వచ్చినప్పుడు అదే శాంపిల్ పిప్పెట్ ను వాడుతారు. దీంతో  వ్యాధులు ఒకరినుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం లేకపోలేదు.  చాలాచోట్ల   గ్లౌజులు, కాటన్ ఇవ్వలేదు. హ్యాండ్ వాష్ చేసుకోడానికి ఎలాంటి సోప్స్ ఇవ్వలేదు. పరీక్ష చేయడానికి బాటిళ్లలో కెమికల్స్​ ఇచ్చారు. టెస్ట్​ ట్యూబ్​లోకి డైరెక్ట్​గా బాటిల్​తో కెమికల్​ పోయడం సాధ్యం కాక సొంత డబ్బులతో ఆశా వర్కర్లు చిన్న డబ్బాలు,  డ్రాపర్ లను కొనుగోలు చేస్తున్నారు.   రిస్క్​ ఉండడంవల్ల ఈ  పద్ధతికి స్వస్తి పలికి చాలా కాలంగా డిజిటల్ పద్దతిలో టెస్టులు చేస్తున్నారు. నిపుణులు కూడా పాత పద్దతి అంత మంచిదికాదని,  డిజిటల్ మిషన్ తో టెస్టులే సురక్షితం అంటున్నారు. కొన్ని  కంపెనీలకు లాభం చేసేందుకే కిట్లను పంపిణీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.