శివసేనలోకి రాజాసింగ్?.. హిందుత్వ పార్టీ వైపే గోషామహల్ ఎమ్మెల్యే చూపు

శివసేనలోకి  రాజాసింగ్?..  హిందుత్వ పార్టీ వైపే గోషామహల్ ఎమ్మెల్యే చూపు
  • నిన్న బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో కమలనాథులు
  • మాధవీలతతో సునీల్ బన్సల్ చర్చలు
  • విక్రం గౌడ్ తో భేటీ అయిన డీకే అరుణ
  • గోషామహల్ లో పట్టుకోసం బీజేపీ యత్నాలు

హైదరాబాద్: నిన్న బీజేపీని వీడిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శివసేన వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా బీజేపీ నాయకత్వం తీరును వ్యతిరేకిస్తూ వచ్చిన రాజాసింగ్ నిన్న పార్టీకి  రాజీనామా చేశారు. అయితే ఆయన ప్రస్తుతం గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్నందున పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాను హిందుత్వ ఎజెండాతోనే ముందుకు వెళ్తానని చెప్పిన రాజాసింగ్ అదే ఎజెండా కలిగిన శివసేన పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఆయన గతంలోనే శివసేనలో చేరతారని , నాందేడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి  పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. 

ALSO READ | మాకు రాగి సంకటి, చేపల పులుసు వద్దు.. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్ రెడ్డి

తర్వాత ఆయన బీజేపీలోనే  కొనసాగారు. ప్రస్తుతం తెలంగాణలో శివసేన ఉన్నప్పటికీ ఉనికి లో లేదనే చెప్పాలి. దీంతో చరిష్మా ఉన్న లీడర్ వస్తే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ అటువైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాజాసింగ్ ఉద్ధవ్ థాక్రేతో భేటీ అయ్యేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఆయనకు పార్టీ రాష్ట్ర పగ్గాలు కూడా అప్పగించే అవకాశం ఉందనే  ప్రచారం జరుగుతోంది. 

ఉద్ధవ్ వెంటే నడుస్తారా..?

బాల్ థాక్రే స్థాపించిన శివసేన పార్టీ ప్రస్తుతం రెండుగా విడిపోయింది. ఒకటి ఉద్ధవ్ థాక్రే వర్గం మరొకటి షిండే వర్గం. షిండే వర్గం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో అలయెన్స్ గా ఉంది. ఇక పోతే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది.  రాజాసింగ్ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన వైపే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. పాత బస్తీలో పేరున్న హిందూ నేతగా, గోరక్ష కు సంబంధించిన కార్యకపాలపాల్లో  చురుగ్గా పాల్గొంటున్న రాజాసింగ్ శివసేనలో చేరితే ఆ పార్టీకి  తెలంగాణలోనూ కొత్తగా స్థానం లభించే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలు సీట్లను కూడా గెలుచుకుంటుందని తెలుస్తోంది. 

టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి..

తెలుగుదేశం పార్టీ ద్వారా రాజాసింగ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2009లో మంగళ్ హాట్ డివిజన్ నుంచి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా గెలుపొందారు. కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న మంగళ్ హాట్ లో ఆయన గెలుపు అప్పట్లో సంచలనమనే చెప్పొచ్చు. 2014లో బీజేపీలో చేరి గోషామహల్  స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాజాసింగ్ విజయం సాధించారు. అప్పటి  నుంచి ఆయన ఆ సెగ్మెంట్ నుంచి గెలుస్తూనే వస్తున్నారు. తాను హిందుత్వ ఎజెండాతోనే పనిచేస్తానని గతంలో పలుమార్లు చెప్పారు.  ఈ క్రమంలో ఆయన శివసేన వైపే అడుగులు వేసే అవకాశం  ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 

డ్యామేజ్ కంట్రోల్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా తర్వాత పార్టీ అధినాయకత్వం డ్యామేజ్ కంట్రోల్ పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోక్ సభ  స్థానం  నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూసిన మాధవీలతతో జాతీయ నాయకులు సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. పాత నగరంపై పట్టు పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా గోషామహల్ లో ప్రత్యామ్నాయ నేతల కోసం ప్రయత్నించాలని సూచించినట్టు సమాచారం. ఇదే తరుణంలో గోషామహల్ టికెట్ ఆశించి భంగపడ్డ విక్రమ్ గౌడ్ తో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చర్చలు జరిపినట్టు సమాచారం. ఆయనను యాక్టివ్ చేసేందుకు ఆమె  ప్రయత్నాలు  ప్రారంభించినట్టు తెలుస్తోంది.