
హైదరాబాద్: కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు మరణశాసనాలు అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీళ్లే మన ప్రధాన అజెండా అని.. ఇప్పుడు కూడా మన నీటి హక్కులను కాపాడాలనే మా పోరాటమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్ట్‌పై మంగళవారం (జూలై 1) ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంబంధిత అధికారులు ఈ పీపీలో పాల్గొన్నారు.
ALSO READ | బనకచర్లకు అనుమతుల తిరస్కరణ తెలంగాణ సర్కార్ విజయం: మంత్రి ఉత్తమ్
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించారు. 811 టీఎంసీలలో 512 టీఎంసీల నీళ్లను కేసీఆర్ ఏపీకి ఇచ్చారు. తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలు అని సంతకం చేశారు. కేటాయించిన 299 టీఎంసీల నీటిలో కూడా 220 టీఎంసీలకు మించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ వినియోగించుకోలేదు. ఈ పని చేసి అనాడే కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతం 68 శాతం తెలంగాణలో ఉంది.. 68 శాతం ఉన్న తెలంగాణకు 299 టీఎంసీలే ఎలా వస్తాయని ప్రశ్నించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్, హరీష్ రావే తొమ్మిదిన్నర ఏండ్ల పాటు నీటి పారుదల శాఖను చూశారు. డబ్బులకు కక్కుర్తి పడి ప్రజల విశ్వాసాన్ని కేసీఆర్, హరీష్ రావు వమ్ము చేశారని విమర్శించారు. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో నీటి కేటాయింపులపై బీఆర్ఎస్ ఏనాడు ప్రశ్నించలేదన్నారు. గోదావరిలో నీటి లభ్యత 1480 టీఎంసీలుగా గుర్తించారని తెలిపారు. గోదావరిపై పెండింగ్ ప్రాజెక్ట్ లేవి కేసీఆర్ పూర్తి చేయలేదని.. అందులో ప్రధానమైనది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని అన్నారు.
ధనదాహం కోసమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని ఆరోపించారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోస్తే.. వరదలొచ్చి మళ్లీ నీటిని కిందకు వదిలేవారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రూ.7 వేల కోట్లు కరెంట్ బిల్లులు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ పునరుజ్జీవనం కోసం ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని.. అందుకే నీళ్ల సెంటిమెంట్‌ను మళ్లీ వాడుకుంటున్నారని మండిపడ్డారు. క్షుద్రపూజలు చేసే నాయకుడు కుట్రలు చేస్తున్నాడని కేసీఆర్‌ను విమర్శించారు.
బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం ఏపీ సీఎంను, తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ బద్నాం చేస్తుందని ఫైర్ అయ్యారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు. ఇందులో భాగంగానే రోజా ఇంటికెళ్లి రాగి సంకటి, చేపల పులుసు తిని రాయలసీమను రత్నాల సీమ చేస్తానని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. మాకు రాగి సంకటి, చేపల పులుసు వద్దని.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని తేల్చి చెప్పారు.