
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సామాన్య ప్రజల నెత్తిన మరో పిడుగు పడింది. పాకిస్తాన్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరపై 8 రూపాయల 36 పైసలు పెంచింది. దీంతో.. పాకిస్తాన్లో ఇప్పటిదాకా 258 రూపాయల 43 పైసలు ఉన్న లీటర్ పెట్రోల్ ధర 266 రూపాయల 79 పైసలకు పెరిగింది. పాకిస్తాన్లో పెరిగిన పెట్రోల్ ధరలు జులై 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ ధరలు ఒక్క నెల వ్యవధిలోనే పాకిస్తాన్లో రెండోసారి పెరిగాయి. జూన్ 16నే పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు పెరిగాయి. మళ్లీ.. ఇప్పుడు పెరగడంతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు.
లీటర్ డీజిల్ కూడా పాకిస్తాన్లో 272 రూపాయల 98 పైసలుగా ఉంది. పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్పై 2 రూపాయల 50 పైసల కార్బన్ లెవీని ప్రభుత్వం విధించింది. దీంతో.. లీటర్ పెట్రోల్పై పెట్రోలియం డెవలప్మెంట్ లెవీ (PDL) 75 రూపాయల 52 పైసలు విధించడం గమనార్హం. లీటర్ డీజిల్పై 74 రూపాయల 51 పైసలు PDLను పాకిస్తాన్ ప్రభుత్వం విధించడం గమనార్హం. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గు ముఖం పట్టిన తర్వాత కూడా పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ALSO READ | గాజాస్కూళ్లపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి..95 మంది పాలస్తీనియన్లు మృతి
పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారత్తో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్కు అంత సీన్ లేదని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి. ద్రవ్యోల్పణం పెరిగింది. అమెరికా డాలర్తో పోలిస్తే, అక్కడి రూపాయి విలువ పడిపోతోంది. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్యులకు కడుపు నిండా తిండి దొరకట్లేదని పాకిస్తాన్ ప్రజలు వాపోతున్నారు. పరిశ్రమలు చాలా వరకు కరెంటు, ముడి పదార్థాల కొరతతో మూతపడ్డాయి. దీంతో చాలా మందికి పని దొరకట్లేదు. ఉపాధి అవకాశాలు తగ్గిపోయి నిరుద్యోగం విలయ తాండవం చేస్తోంది.