పతనం అంచున డాలర్.. గోల్డ్కు డిమాండ్.. రూ.1,200 పెరిగిన బంగారం ధర !

పతనం అంచున డాలర్.. గోల్డ్కు డిమాండ్.. రూ.1,200 పెరిగిన బంగారం ధర !

న్యూఢిల్లీ: అమెరికా లో ఆర్థిక మాంద్యం తప్పదనే భయాలతో బంగారంపై డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. మందగిస్తున్న యూఎస్ ఆర్థిక వ్యవస్థ కారణంగా డాలర్ క్షీణిస్తోంది. డాలర్ లో ఫాల్ తప్పదనే భయాలు ఇన్వెస్టర్లను కమ్ముకున్నాయి. దీనికి తోడు ప్రపంచ దేశాలతో ట్రేడ్ కు డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో.. యూఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆందోళన ప్రపంచ దేశాలలో నెలకొంది. ఈ పరిస్థితుల్లో బంగారం సేఫ్  బెట్ గా ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ మళ్లీ మారుతోంది. దీంతో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటన్నాయి. 

 వరుసగా ఏడు రోజులుగా తగ్గిన బంగారం ధర మంగళవారం (జులై 01) పెరిగింది. దేశ రాజధానిలో దీని ధర రూ.1,200 ఎగిసి రూ.98,670కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర సోమవారం 10 గ్రాములకు రూ.97,470 వద్ద స్థిరపడింది. మంగళవారం 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,100 పెరిగి రూ.98,150కి చేరుకుంది. 

గత మార్కెట్ ముగింపులో ఇది 10 గ్రాములకు రూ.97,050 వద్ద ముగిసింది.   వెండి ధరలు మంగళవారం కిలోగ్రాముకు రూ. 2,000 పెరిగి రూ. 1,04,800కి చేరుకున్నాయి. సోమవారం కిలో ధర రూ. 1,02,800 వద్ద ముగిసింది.