IND VS ENG 2025: జైశ్వాల్ హాఫ్ సెంచరీ.. తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

IND VS ENG 2025: జైశ్వాల్ హాఫ్ సెంచరీ.. తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఎడ్జ్ బాస్టన్ టెస్టులో టీమిండియా మొదటి రోజు తొలి సెషన్ లో రాణించింది. ఓపెనర్ రాహుల్ విఫలమైనా.. కరుణ్ నాయర్, జైశ్వాల్ భాగస్వామ్యంతో భారత్ తొలి ఈ సెషన్ లో కోలుకుంది. జైస్వాల్ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. ఇంగ్లాండ్ రెండు కీలక వికెట్లు తీసి పర్వాలేదనిపించింది. దీంతో తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. క్రీజ్ లో జైశ్వాల్ (62), కెప్టెన్ శుభమాన్ గిల్(1) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, కార్స్ తలో వికెట్ తీసుకున్నారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్స్ ను ఆచితూచి ఆరంభించింది. జైశ్వాల్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడితే.. మరో ఎండ్ లో రాహుల్ పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యాడు. మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులు చేయనీయకుండా చేశారు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బంది పడిన రాహుల్ వోక్స్ చేతికి చిక్కాడు. 26 బంతుల్లో 2 పరుగులు చేసిన రాహుల్ వోక్స్ ఇన్ స్వింగ్ కు క్లీన్ బౌల్డయ్యాడు. ఈ దశలో కరుణ్, జైశ్వాల్ జట్టును ముందకు తీసుకెళ్లారు. 

►ALSO READ | భారత యార్కర్ కింగ్‎కు ఏమైంది..? ఇంగ్లాండ్‎తో రెండో టెస్ట్ కు బుమ్రా దూరం.. కారణమిదే

ఇద్దరూ ఎలాంటి అనవసర షాట్స్ కు పోకుండా జాగ్రత్తగా ఆడారు. ముఖ్యంగా కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ బౌలర్లపై ఎటాకింగ్ షాట్స్ ఆడుతూ ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. రెండో వికెట్ కు 80 పరుగులు జోడించిన తర్వాత వీరి జోడీని కార్స్ విడగొట్టాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కరుణ్ నాయర్.. కార్స్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గిల్ తో కలిసి జైశ్వాల్ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.