లాల్ దర్వాజా సింహవాహినికి తొలిబోనం

లాల్ దర్వాజా సింహవాహినికి తొలిబోనం

హైదరాబాద్,వెలుగు: లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో ఆషాడ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆలయ వ్యవస్థాపక అనువంశిక గౌడ రంగ రమేశ్ గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. బాలగంజిలోని ఇంటిలో పసుపు కుంకుమలతో అలంకరించిన అమ్మవారి బోనాన్ని డప్పు చప్పుళ్లు, మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి లాల్ దర్వాజా అమ్మవారికి సమర్పించారు. కల్లు సాక పోసి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. 

ప్రతి ఏడాది ఆషాడ మాసంలో రమేష్ గౌడ్ కుటుంబం తొలి బోనం సమర్పించడం ఆచారంగా వస్తోంది. బోనం సమర్పించిన అనంతరం ఆలయ అర్చకులు రంగ రమేశ్​గౌడ్, రంగా మణికంఠ గౌడ్ కుటుంబాన్ని వేదమంత్రాలతో ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదం అందజేశారు. 

లాల్ దర్వాజా అమ్మవారికి ప్రతి ఏటా ఆషాడ మాసంలో తొలి బోనం సమర్పించి ముక్కులు తీర్చుకోవటం సంతోషంగా ఉందని రమేశ్​గౌడ్ కుటుంబ సభ్యులు తెలిపారు. తొలి ఆదివారం నుంచి చివరి ఆదివారం వరకు అమ్మవారికి బోనాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తుంది. ఈనెల28న అమ్మవారికి ప్రధాన బోనాలు ఉత్సవ సమర్పణ జరుగుతుంది. 29న ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి.