
గోల్కొండ కోటలోని శ్రీజగదాంబికా మహంకాళి అమ్మవారికి ఆషాఢ మాస నాలుగో పూజను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాతబస్తీతోపాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు, తొట్టెలు, మొక్కులు చెల్లించుకున్నారు. గతవారం తోపులాట ఘటన నేపథ్యంలో ఈ ఆదివారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
లంగర్ హౌస్‌లో బీజేవైఎం, యూత్ అసోసియేషన్, గౌడ సంఘం ఆధ్వర్యంలో స్వాగత వేదికలు ఏర్పాటు చేయగా, బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్. రామచంద్రరావు బోనాల ఊరేగింపులకు స్వాగతం పలికారు. అలాగే, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, సమాచార సాంకేతిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైటెక్‌సిటీలో బోనాల పండుగ నిర్వహించారు. ఇందులో ఐటీ ఉద్యోగులు బోనాలు ఎత్తుకొని శిల్పకళా వేదిక నుంచి చిన్న పెద్దమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.