కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) సోదరుడు ఆశిమ్ బెనర్జీ (60) కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా కోల్ కతాలోని మెడికా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఇవాళ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సీఎం మమతా బెనర్జీకి ఆరుగురు సోదరుల్లో చనిపోయిన ఆశిమ్ బెనర్జీ చిన్నవాడు. కుటుంబ సభ్యులందరూ కాళీఘాట్ ప్రాంతంలో నివసిస్తున్నారు. కరోనా నిబంధనల ప్రకారం శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని సీఎం కుటుంబ సభ్యులు మీడియాకు సమాచారం ఇచ్చారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం రేపటి నుంచి ఈనెల 30 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
