పీర్ల పండుగ కాదు.. ప్రాక్టీస్: నిప్పులపై నడిచిన యువ క్రికెటర్.. వీడియో

పీర్ల పండుగ కాదు.. ప్రాక్టీస్: నిప్పులపై నడిచిన యువ క్రికెటర్.. వీడియో

ఆసియన్ దేశాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ 2023 సమరం మరో 9 రోజుల్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 30న ముల్తాన్‌ వేదికగా జరగనున్న నేపాల్‌ - పాక్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే ఆరు జట్లు ప్రాక్టీస్‌లో తలమునకలై ఉన్నాయి.

ఇదిలావుంటే ఈ టోర్నీలో విజయమే లక్ష్యంగా కొందరు బంగ్లాదేశ్ క్రికెటర్లు వినూత్న పద్ధతిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. తాజాగా ఆ జట్టు యువ క్రికెటర్ మహ్మద్ నయీమ్ మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రత్యేక శిక్షణ మొదలుపెట్టాడు. సబిత్ రేహాన్‌ అనే మైండ్ ట్రైనర్‌‍ను నియమించుకొని.. అతని సాయంతో నిప్పులపై నడుస్తూ సాహసాలు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా నిప్పులపై నడిచే సన్నివేశాలు కొన్ని ప్రత్యేక సంధర్భాల్లో కనిపిస్తుంటాయి. అలాంటిది ఒక టోర్నీలో గెలుపు కోసం క్రికెటర్ ఇలాంటి సాహసాలు చేయటం చూసి నెటిజెన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. పడుకొని పొర్లితే.. మ్యాచులు గెలవకుండానే ట్రోఫీ చేజిక్కించుకోవంటూ అతన్ని ఆట పట్టిస్తున్నారు. 

ఆసియా కప్ 2023లో పాల్గొనే జట్లు:

ఈ మెగా టోర్నీలో ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మరియు నేపాల్. కాగా ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది.

బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తంజీద్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్మద్, షేక్ మహిదీ, నసుమ్ అహ్మద్, షమీమ్ హొస్సేన్, అఫీఫ్ హొస్సేన్, షరిఫుల్ ఇస్లాం, ఎబాదత్ హొస్సేన్, నయీమ్ షేక్.