Asia Cup 2025: ఆసియా కప్ 2025.. అదే జరిగితే ఇండియా- పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌లు

Asia Cup 2025: ఆసియా కప్ 2025.. అదే జరిగితే ఇండియా- పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌లు

క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్ అందింది. షెడ్యూల్ ప్రకారం అనుకున్న సమయానికే ఆసియా కప్‌-2025 ప్రారంభం కానున్నట్టు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం సెప్టెంబర్ 5న ఈ మెగా టోర్నీ జరిపేందుకు  ఆసియా క్రికెట్‌ మండలి (ACC) ఏర్పాట్లు చేస్తున్నారు. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు ధాటికి భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఇకపై మ్యాచ్ లు జరుగుతాయా లేదా అనే అనుమానాలు ఏర్పడ్డాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. దీంతో ఆసియా కప్ లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తునట్టు సమాచారం. 

అధికారిక షెడ్యూల్ జూలై మొదటి వారంలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం సెప్టెంబరు 5న ఆరంభం కానున్న ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 7 న మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఇరు జట్లు సూపర్-4 కు అర్హత సాధిస్తే సెప్టెంబర్ 14 న మ్యాచ్ జరగనుంది. ఇండియా, పాకిస్థాన్ జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తే సెప్టెంబర్ 21 న ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ చూడొచ్చు. అంటే మొత్తం  వస్తే మూడు సార్లు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకి కలగనుంది. తటస్థ వేదికైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో టోర్నీ మ్యాచ్ లన్నీ జరగనున్నట్టు తెలుస్తుంది.

2022, 2023 మాదిరే ఈసారి కూడా గ్రూప్‌ దశ తర్వాత సూపర్‌ ఫోర్‌ ఫార్మాట్లోనే టోర్నీని నిర్వహించనున్నట్లు సమాచారం. 2026 లో భారత్, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ కారణంగానే టీ20 ఫార్మాట్ లో ఈ టోర్నీ జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక 2027 ఆసియా కప్ బంగ్లాదేశ్ లో జరుగుతుందని.. అప్పుడు ఈ టోర్నీ వన్డే ఫార్మాట్ లో జరుగనుందని స్పష్టం చేసింది. 2027 దక్షిణాఫ్రికా వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది 

2025 ఆసియా కప్ లో మొత్తం 13 మ్యాచ్ లు జరగనున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తో పాటు మరో జట్టు క్వాలిఫైయింగ్ ఈవెంట్ ద్వారా ఎంపిక చేయబడింది. 2023 లో ఆసియా కప్ ను పాకిస్థాన్, శ్రీలంక వేదికలుగా నిర్వహించారు. వన్డే ఫార్మాట్ లో సాగిన ఈ టోర్నీలో శ్రీలంకను ఫైనల్లో ఓడించి  భారత్ విజేతగా నిలిచింది.