చేతులెత్తేసిన లంక బోర్డు..యూఏఈకి ఆసియా కప్

చేతులెత్తేసిన లంక బోర్డు..యూఏఈకి ఆసియా కప్

ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. లంకలో జరగాల్సిన ఆసియా కప్  మరో చోటుకు తరలిపోయింది. ఆసియా కప్ 2022 టోర్నీని యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనంతరం ఆసియాకప్ టోర్నీపై స్పందించి గంగూలీ..ఈ ఏడాది ఆసియాకప్  యూఏఈలో జరుగుతుందని తెలిపాడు. వర్షాలు లేని ప్రదేశం అదొక్కటే కాబట్టి..అక్కడ నిర్వహించడం బెటర్ అని భావించినట్లు చెప్పాడు.  అయితే ఆసియాకప్ ను నిర్వహణపై లంకబోర్డు చేతులెత్తేయడంతో.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. 

ఖర్చులు భరించలేక...
ఆర్థిక సంక్షోభం..అధ్యక్షుడు పారిపోవడం,నిరసనకారుల ఆందోళనలు నెలకొన్నా..లంక బోర్డు  ఆస్ట్రేలియాతో  టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం పాక్ తో టెస్టు సిరీస్ ను కూడా సక్సెస్ గా నిర్వహిస్తోంది. కానీ ఆసియాకప్ ను మాత్రం నిర్వహించలేమని చేతులెత్తేసింది. ఈ టోర్నీలో  మొత్తం ఆరు దేశాలు  పాల్గొంటాయి. దీంతో ఈ టోర్నీకి వచ్చే ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ హోటల్ వసతులు, స్టేడియంలో సౌకర్యాల కల్పన, ఇతర ఖర్చులను భరించే స్థితిలో లంక బోర్డు లేదు. దీనికి తోడు ప్రస్తుతం లంకలో పరిస్థితి బాగాలేకపోవడంతో..ఆసియా కప్ జరుగుతున్న సమయంలో నిరసనలు ఉదృతమైనా..టోర్నీ ఆగిపోయినా..అపకీర్తి మూటగట్టుకోవాల్సి వస్తుంది. దీని కంటే..టోర్నీ నిర్వహించకపోవడమే బెటర్ అని లంక బోర్డు భావించి..నిర్ణయానికి వచ్చింది. దీనికి తోడు రీసెంట్ గా లంక ప్రీమియర్ లీగ్ మూడో  సీజన్  ఈ సంక్షోభం కారణం వాయిదా పడింది. ఇది కూడా ఆసియాకప్ నుంచి లంక తప్పుకోవడానికి ఒక కారణం. 

బంగ్లాదేశ్ లో వర్షాలు..యూఏఈకి తరలింపు..
లంకలో పరిస్థితిని ముందే ఊహించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్..టోర్నీని బంగ్లాదేశ్లో నిర్వహించాలని భావించింది. అయితే  అక్కడ వర్షాకాలం నేపథ్యంలో..సగం మ్యాచులు వర్షార్పణమయ్యే ఛాన్సుంది. ఇవన్నీ ఆలోచించిన ఏసీసీ అధికారులు ఆసియా కప్ టోర్నీ నిర్వహణ కోసం యూఏఈ క్రికెట్ బోర్డును సంప్రదించారు. యూఏఈ క్రికెట్ బోర్డు ఒప్పుకోవడంతో ఆసియా కప్ ఈ సారి యూఏఈలో జరగనుంది. ఆసియా కప్ ఆగస్టు 27నుండి సెప్టెంబర్ 11వరకు జరగనుంది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో టోర్నీని నిర్వహించనున్నారు.