కొరియాకు చెక్‌‌ పెడతారా? ..ఇవాళ్టి( సెప్టెంబర్ 3 )నుంచి ఇండియా సూపర్‌‌–4 మ్యాచ్‌‌

కొరియాకు చెక్‌‌ పెడతారా? ..ఇవాళ్టి( సెప్టెంబర్ 3 )నుంచి ఇండియా సూపర్‌‌–4 మ్యాచ్‌‌

రాజ్‌‌గిర్‌‌ (బిహార్‌‌): పూల్‌‌ దశలో అద్భుత విజయాలతో హోరెత్తించిన ఇండియా.. ఆసియా కప్‌‌ సూపర్‌‌–4 స్టేజ్‌‌లో కఠిన పరీక్షకు సిద్ధమైంది. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌‌లో ఐదుసార్లు చాంపియన్‌‌ కొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మూడు మ్యాచ్‌‌ల్లో 4–3తో చైనాపై, 3–2తో జపాన్‌‌పై చెమటోడ్చి నెగ్గిన టీమిండియా 15–0తో కజకిస్తాన్‌‌ను మాత్రం హడలెత్తించింది. అయితే తొలి రెండు మ్యాచ్‌‌ల ఆటతీరును పరిగణనలోకి తీసుకుంటే కొరియా నుంచి ఇబ్బందులు తప్పవు. పూల్‌‌–బిలో కొరియా రెండో స్థానంలో నిలవడం, ఇప్పటి వరకు వాళ్ల అత్యుత్తమ పెర్ఫామెన్స్‌‌ చూపెట్టకపోవడం కాస్త కలిసొచ్చే అంశం. ఆఖరి మ్యాచ్‌‌లో 1–4తో మలేసియా చేతిలో ఓడటం కూడా కొరియన్ల కాన్ఫిడెన్స్‌‌ దెబ్బతీసింది. మధ్యాహ్నం మ్యాచ్‌‌ల్లో ఎండ తీవ్రత కొరియన్ల ఆటపై ప్రభావం చూపింది. కానీ సూపర్‌‌–4 మ్యాచ్‌‌లన్నీ సాయంత్రం జరగనున్నాయి. దీనికి తోడు ఒక్క రోజు విరామం లభించడంతో కొరియన్లు తమ పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. కజక్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా గోల్‌‌ కీపింగ్‌‌, డిఫెన్స్‌‌, మిడ్‌‌ఫీల్డ్‌‌, అటాకింగ్‌‌లో ఆకట్టుకుంది. దాంతో తర్వాతి మ్యాచ్‌‌లోనూ వీటిని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్వర్డ్‌‌ లైన్‌‌లో అభిషేక్‌‌ నాలుగు గోల్స్‌‌తో రాణించడం సానుకూలాంశం. గోల్స్‌‌తో పాటు బంతిని సర్కిల్‌‌లోకి తీసుకున్నప్పుడు అభిషేక్‌‌ పొజిషనింగ్‌‌, స్ట్రయికింగ్‌‌ ఆకట్టుకున్నాయి. 

హ్యాట్రిక్‌‌ సాధించిన సుఖ్‌‌జీత్‌‌ సింగ్‌‌... డ్రిబ్లింగ్‌‌తో సర్కిల్‌‌ డిలో ప్రశాంతంగా ఆడుతున్నాడు. అనుభవజ్ఞుడైన మణ్‌దీప్‌‌ సింగ్‌‌ తన స్టిక్‌‌ వర్క్‌‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే ఫార్వర్డ్‌‌ లైన్‌‌లో కీలకమైన దిల్‌‌ప్రీత్‌‌ ఫామ్‌‌ ఇబ్బందిగా మారింది. ఒక్క గోల్‌‌ చేసినా అవకాశాలను మిస్‌‌ చేస్తున్నాడు. స్ట్రయికర్లపై చీఫ్‌‌ కోచ్‌‌ క్రెయిగ్‌‌ ఫుల్టన్‌‌ సంతృప్తితోనే ఉన్నాడు. అమిత్‌‌ రోహిడాస్‌‌, జుగ్‌‌రాజ్‌‌ సింగ్‌‌, సంజయ్‌‌తో కూడిన బ్యాక్‌‌ లైన్‌‌ కూడా బలంగా ఉండటం కలిసొచ్చే అంశం. గోల్‌‌ కీపర్‌‌ క్రిషన్‌‌ బహుదూర్‌‌ పాఠక్‌‌ ఫామ్‌‌లోకి రావడం శుభసూచకం. అయితే కజక్‌‌పై ఆట ఎలా ఉన్నా.. కొరియన్లతో ఆడే ఆటతోనే అసలైన టోర్నీ మొదలవుతుందని అందరూ నమ్ముతున్నారు. ఇందులో గెలిస్తే ఇండియాకు రాబోయే మ్యాచ్‌‌ల్లో పెద్దగా ఇబ్బంది ఎదురుకాదు.