
న్యూఢిల్లీ: ఆసియా కప్ కోసం టీమిండియా ఎంపికకు రంగం సిద్ధమైంది. మంగళవారం సమావేశం కానున్న సీనియర్ సెలెక్షన్ కమిటీ టీమ్‌ను ప్రకటించనుంది. స్టార్లపై భారీ అంచనాలు నెలకొని ఉన్నా.. కొంత మంది ప్లేయర్లకు మాత్రం జట్టులో చోటు కష్టంగానే కనిపిస్తోంది. సీనియర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్, కీపర్ జితేశ్ శర్మ టీ20 సెటప్‌లోకి తిరిగి వచ్చే చాన్స్ ఉంది. 2024 జులైలో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఇద్దరు టీ20ల్లో కనిపించలేదు. శ్రేయస్ 2023 డిసెంబర్ లో, జితేశ్ గతేడాది జనవరిలో చివరిసారిగా టీ20 మ్యాచ్‌లు ఆడారు. అయితే యూఏఈ పిచ్‌లు నెమ్మదిగా ఉండటంతో అనుభవజ్ఞులతో కూడిన పటిష్టమైన మిడిలార్డర్ ఉండాలని టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ ఎంపిక ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ మొదలైంది. బలమైన మిడిలార్డర్ కోసం శ్రేయస్‌ను ఎంపిక చేస్తే.. ఆల్‌రౌండర్ శివం దూబే, ఫినిషర్ రింకూ సింగ్‌పై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి సెలెక్టర్లు ఆ దిశగా అడుగులు వేస్తారా? అన్నది ఆసక్తికరం. ఇప్పటి వరకు ఈ ఇద్దరు టీమిండియా టీ20 ఫార్మాట్‌లో కీలకంగా ఉన్నారు. జనవరిలో ఇంగ్లండ్‌పై కూడా బరిలోకి దిగారు. ఇక ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన వికెట్ కీపర్ జితేశ్‌కు ఈసారి చాన్స్ దక్కొచ్చు. ధ్రువ్ జురెల్ ప్లేస్‌లో అతను జట్టులోకి రావొచ్చు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో సంజూ శాంసన్‌కు రిజర్వ్ వికెట్ కీపర్‌గా జురెల్ వ్యవహరించాడు.
టీ20ల్లో గిల్, జైస్వాల్ కష్టమే!
టెస్టు లీడర్ శుభ్‌మన్ గిల్‌ను టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా, యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా తీసుకొస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో షార్ట్ ఫార్మాట్‌లో ఈ ఇద్దరికీ చోటు కష్టమేనని తెలుస్తోంది. గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియా ఆడిన 15 టీ20ల్లో 13 మ్యాచ్‌లు గెలిచింది. అందులో ఉన్న కోర్ గ్రూప్‌తోనే ఆసియా కప్‌కు వెళ్లడానికి మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపుతోంది. దీనికి తోడు తర్వాత జరిగే సిరీస్‌లకు మధ్య పెద్దగా సమయం కూడా లేదు. దాంతో ఫార్మాట్లను మార్చుకుని బ్యాటింగ్‌లో రాణించాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్‌ను ఇప్పటికైతే టెస్ట్‌లకే పరిమితం చేసే చాన్స్ కనిపిస్తోంది. సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్ ముగిసిన వెంటనే.. అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. దీనికోసం సెలెక్టర్లు గిల్, జైస్వాల్‌ను ఫ్రెష్‌గా ఉంచే అవకాశం ఉంది. వీళ్లపై ఎక్కువగా ఒత్తిడి లేకుండా, గాయాలు కాకుండా చూసుకోవడం ముఖ్యమైన అంశం. మొత్తానికి ఫార్మాట్లకు అనుగుణంగా టీమిండియాను రూపొందించడానికి ప్రయత్నిస్తున్న సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయాలు
తీసుకుంటారో చూడాలి.
బుమ్రాను ఏం చేస్తారు?
పేస్ లీడర్ జస్‌ప్రీత్ ఆసియా కప్ టీమ్ సెలెక్షన్‌కు అందుబాటులో ఉంటానని మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, వర్క్ లోడ్‌పై దృష్ట్యా బుమ్రాను ఆడిస్తారా? లేదా? అన్న సందిగ్ధత కొనసాగుతోంది. దీనిపై సెలెక్టర్ల నిర్ణయం కీలకం కానుంది. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ అందుబాటులో లేకపోవడంతో పేసర్ స్లాట్ ఖాళీగా ఉంది. దాంతో బుమ్రాను తీసుకొస్తారా? లేక ఐపీఎల్‌లో రాణించిన ప్రసిధ్ కృష్ణను కొనసాగిస్తారా? చూడాలి. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ తర్వాత ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెలెక్షన్ కమిటీ మీటింగ్‌కు హాజరుకానున్నాడు. 2026 టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేసున్న తరుణంలో సూర్య అభిప్రాయం కీలకంగా మారనుంది.