విరబూసిన ‘తులిప్’

విరబూసిన ‘తులిప్’

ఈ నెల 19న జమ్మూకాశ్మీర్​లోని తులిప్ గార్డెన్ ఓపెన్  

శ్రీనగర్ : ఆసియాలోనే అతి పెద్దదైన జమ్మూకాశ్మీర్ లోని తులిప్ గార్డెన్ విరబూసిన పూలతో ఆకట్టుకుంటోంది. రంగరంగుల పూలతో పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఈ నెల 19 నుంచి పర్యాటకులను అనుమతిస్తామని, అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ‘‘మేం ప్రతిఏటా గార్డెన్ ను విస్తరిస్తున్నాం. కొత్త వెరైటీ మొక్కలను పెంచుతున్నాం. పోయినేడాది 2 లక్షల మంది విజిటర్స్ వచ్చారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే చాలామంది మాకు ఫోన్ చేసి, గార్డెన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని అడుగుతున్నారు. వచ్చే ఆదివారం ఓపెన్ చేసేందుకు స్పీడ్ గా పనులు చేస్తున్నాం” అని చెప్పారు. ఏటా మార్చి, ఏప్రిల్ మధ్యలో తులిప్ పూలు విరబూస్తాయన్నారు. 

2008లో ఏర్పాటు.. 

ఈ తులిప్ గార్డెన్ ను 2008లో శ్రీనగర్ లో ఏర్పాటు చేశారు. దీనికి ఇందిరాగాంధీ పేరు పెట్టారు. ఈ గార్డెన్ ను సిరాజ్ బాగ్ అని కూడా పిలుస్తారు. దాల్ సరస్సు, జబర్వాన్ కొండల మధ్య ఉండే తులిప్ గార్డెన్.. ఎంతో అందంగా ఉంటుంది. 130 ఎకరాల్లో ఉండే ఈ గార్డెన్ లో 15 లక్షల తులిప్ పూలు ఉన్నాయి. ఇక్కడ ఇతర పూల మొక్కలు కూడా చాలానే ఉన్నాయి.