- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్
ఆసిఫాబాద్, వెలుగు: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 11న జరగనున్న నేపథ్యంలో జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మొదటి విడత పోలింగ్ నిర్వహించే లింగాపూర్, సిర్పూర్-యు, జైనూర్, కెరమెరి, వాంకిడి ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు, జోనల్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా రివ్యూ నిర్వహించారు.
11న నిర్వహించే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని.. సరిపడా కుర్చీలు, టేబుళ్లు, వెలుతురు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది ముందు రోజు సాయంత్రం 4 గంటలకు అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అధికారులు పర్యవేక్షించాలని, ఎన్నికలలో ఉపయోగించే సామగ్రి, కవర్లు, పేపర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.
బ్యాలెట్ పత్రాలను సరి చూసుకోవాలని, స్ట్రాంగ్ రూమ్ వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీ లేకుండా చూసుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కొరకు పంపిణీ కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, జోనల్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీపీవో భిక్షపతి గౌడ్ పాల్గొన్నారు.
