ఆదిలాబాద్ జిల్లాలో పెట్టుబడికి అప్పులిచ్చి డీలర్ల దోపిడీ

ఆదిలాబాద్ జిల్లాలో పెట్టుబడికి అప్పులిచ్చి  డీలర్ల దోపిడీ
  •     పెట్టుబడికి ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడుతున్న రైతన్న
  •     సీజన్​లో డిమాండ్ ను బట్టి లింక్ ప్రొడక్టులు అమ్మకం
  •     అనుమతి లేని బయో ఎరువులు, అధిక ధరలతో బహిరంగ దోపిడీ

ఆసిఫాబాద్, వెలుగు: పంట వేయాలంటే డబ్బుల కోసం డీలర్ల వద్ద చేయి చాల్సిందే అనే పరిస్థితి ఎదురవుతోంది జిల్లా రైతులకు. విత్తనం వేసే దశ నుంచి కోత దాకా రైతు జీవితం ఫెర్టిలైజర్ డీలర్ల చేతుల్లో బందీ అవుతోంది. బ్యాంకు రుణాలు సకాలంలో అందకపోవడం, ప్రభుత్వ పెట్టుబడి సాయం ఆలస్యమవడంతో ఆసిఫాబాద్​జిల్లా రైతులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న డీలర్లు తమకు లాభం వచ్చే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అంటగడుతున్నారు. “ఇది వేసుకుంటేనే మంచి దిగుబడి వస్తుంది” అని నమ్మబలికి రైతులను మోసగిస్తున్నారు. 

అవసరం లేని మందులు, అనుమతులు లేని బయో ఎరువులను కూడా అమ్ముతున్నారు. మార్కెట్ రేట్ల కంటే ఎక్కువగా ధరలు పెట్టి రైతులతో బలవంతంగా కొనిపిస్తున్నారు. ఉద్దెర తీసుకుంటుండడంతో రైతు అదే షాపులో కొనక తప్పడంలేదు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో లోపాలు, నియంత్రణలో లొసుగులు సమస్యను మరింత పెంచుతున్నాయి. 

బయో మందులు అంటగడుతున్నరు

రైతుల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఫెర్టిలైజర్ డీలర్లు అనుమతులు లేని బయో పురుగుమందులు, ఎరువులు అంటగడుతున్నారు. అధికారులను మచ్చిక చేసుకుంటున్న డీలర్లు, వ్యాపారులు సీజన్ లో రైతుకు అవసరమైన ఎరువులు పురుగు మందుల్లో కంపెనీ ప్రొడక్టుకు, బయో పురుగుమందుల మధ్య రేట్లలో చాలా తేడా ఉంటుంది. 

కంపెనీ ప్రొడక్ట్ అమ్మితే కొద్దిగా మార్జిన్ దొరుకుతుండగా.. బయో పురుగుమందులు ఎరువులు అమ్మితే ఐదింతల లాభం వస్తున్నట్లు తెలుస్తోంది. బయోలపై కేవలం పేరు, రేటు తప్ప ఇతర విషయాలేమీ ఉండకపోవడం గమనార్హం. బయోలో యూరియా కొద్దిమేర కలపడం వల్ల పంటకు స్ప్రే చేసిన తర్వాత చిగురించే అవకాశం ఉండడంతో రైతులు కొంటున్నారు. 

జీ5 సర్టిఫికెట్ పేరుతో బయో దందా..

ఈ సీజన్​లో ఆసిఫాబాద్​ జిల్లాలో 50 ,216 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వరి  23,463 ఎకరాలు, జొన్నలు 13,550, మక్కలు 4,234, కందులు 3,691, నూనె పంటలు 387, కూరగాయలు 941, ఇతర పంటలు 3,948 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. అయితే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్న ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువులు వాడేందుకు రైతుల్లో అవగాహన కల్పించేందుకు కార్యచరణ రూపొందించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతో బయో ఎరువులు, రసాయనాలను ప్రోత్సాహించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 

ఇదే అదునుగా  ఫెర్టిలైజర్ డీలర్లు పేరు, ఊరు లేని బయో ఎరువులు, ఇతర ప్రొడక్టులను రైతులకు అంటగడుతున్నారు. వ్యవసాయ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో జీ 5 సర్టిఫికెట్లను చూపిస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో వ్యవసాయ అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. 

ఎరువుల వాడకంపై  అవగాహన కల్పించాలి

లాభదాయకమైన సాగు కోసం ఎరువుల వాడకంపై అధికారులు స్పష్టమైన అవగాహన కల్పించాలి. ఏ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏ రకమైన ఎరువులు ఉపయోగించాలి, వాటిని ఎప్పుడు, ఎలా కొనుగోలు చేయాలి అనే విషయాలను ముందే తెలియజేయాలి. ఎరువుల డీలర్లు ఇష్టమొచ్చినట్లు అమ్మకాలు చేస్తున్నారు. రైతులకు అవసరం లేని ఎరువులను కూడా కొనుగోలు చేయాలని ప్రలోభపెడుతున్నారు. సరైన సమాచారం లేక రైతులు కొని నష్టపోతున్నారు. అధికారులు సరైన మార్గదర్శకాలు ఇవ్వాలి. 
-సిడం రాము, రైతు గుడమామడ, జైనూర్

రైతులు జాగ్రత్తగా వుండాలి

వచ్చే ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులు జాగ్రత్తగా వుండాలి. నకిలీ పత్తి విత్తనాలు, మందులు కొనుగోలు చేయవద్దు. అనుమతి లేని విత్తనాలు, మందులు అమ్మినా, కొన్నవారిపైనా చర్యలు తీసుకుంటాం. కొనేటప్పుడు ఆన్ లైన్ రశీదులు తప్పనిసరిగా  తీసుకోవాలి. ఫర్టిలైజర్ షాపుల యజమానులు అవసరమైన మందులు కొనుగోలు చేయాలని రైతులను ఒత్తిడి చేయొద్దు.
– కె.హరిత, కలెక్టర్