టెహ్రాన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఏడు వారాలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు పాకిస్తాన్ తన దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో పాక్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నేరుగా రంగంలోకి దిగారు. గురువారం ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన ప్రత్యేక శాంతి ప్రతిపాదనలతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ చేరుకున్నారు.
అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో భేటీ అయ్యారు. ట్రంప్ ప్రపోజల్స్ తో పాటు యుద్ధంపై సౌదీ అరేబియా, చైనా వంటి దేశాల ఆందోళనలను కూడా మునీర్ ఈ భేటీలో ప్రస్తావించారు. అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణ గడువు వచ్చే వారం ముగియనున్నది.
ఈ తరుణంలో శాంతి చర్చల వేదికను మరోసారి ఇస్లామాబాద్‌కు మార్చేందుకు ట్రంప్ ఆసక్తి చూపుతున్నారు. పాక్ మధ్యవర్తిత్వం అద్భుతంగా ఉందని కూడా ఆయన ప్రశంసించారు.

