- తమ అధినేతల ఆశీస్సులు తీసుకున్నాక దరఖాస్తు చేసుకునే ఆలోచనలో అభ్యర్థులు
- ఇన్నాళ్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేతలు బిజీబిజీ
- ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చినా అప్లికేషన్ వేయకుండా ఆగిన ఆశావహులు
- ఇప్పుడు ఉప ఎన్నిక ముగిసినందున రాజధానికి క్యూ
భద్రాచలం, వెలుగు : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. సర్కార్ మంచి జోష్లో ఉంది. విజయానందాన్ని ఆస్వాదిస్తూ మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టిసారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు ఏర్పాటుపై కదలిక రావడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు షురూ చేశారు. ఇటీవల దేవాదాయ, ధర్మాదాయ శాఖ భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి విదితమే.
జిల్లాలో గత ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించడంలో నాయకులు, కార్యకర్తలది ఎనలేని కృషి ఉంది. దీనితో వీరంతా ఇప్పుడు ఈ ట్రస్టుబోర్డు రేసులోకి వచ్చారు. వాస్తవానికి గతేడాదే నోటిఫికేషన్ ఇవ్వగా 54 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మంత్రుల నుంచి సీఎం వరకు పైరవీలు చేయించుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ నోటిఫికేషన్ రద్దు చేశారు. తిరిగి రెండోసారి నోటిఫికేషన్ రావడంతో తిరిగి తమ ప్రయత్నాలకు ఆశావహులు మొదలు పెట్టారు.
పదేండ్లలో బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలే...!
తెలంగాణ ఆవిర్భవించి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పదేండ్ల కాలంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి ట్రస్టుబోర్డు ఏర్పాటు మరిచింది. నోటిఫికేషన్లే ఇవ్వలే. కాంగ్రెస్ సర్కారు 2023లో పగ్గాలు చేపట్టాక తొలిసారి 2024లోనే తొలి నోటిఫికేషన్ ఇచ్చినా అనివార్య కారణాల వల్ల రద్దు చేయాల్సి వచ్చింది. భద్రాచలం శ్రీరామదివ్యక్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్న రేవంత్రెడ్డి సర్కారు ఇప్పటికే రూ.60కోట్లను భూసేకరణకు కేటాయించింది. భూసేకరణ పూర్తయి, నిర్వాసితులకు మోడల్ కాలనీ నిర్మాణం కోసం స్థలం కూడా చదును చేశారు. మాడవీధులు, ఇతర అభివృద్ధి పనులకు యాక్షన్ ప్లాన్ సిద్ధం అయ్యింది. మరో వైపు ముక్కోటి, శ్రీరామనవమి, 2027 గోదావరి పుష్కరాల వేళ భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ట్రస్టుబోర్డు అవసరం ఉంది.
కాగా, మరోవైపు ఇటీవల సీతారామచంద్రస్వామి దేవస్థానం వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. సిబ్బందిలో చీలికలు, ఆఫీసర్ల వ్యవహారశైలితో ఎదురైన ఇబ్బందులతో ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తోంది. సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వం ద్వారా దేవస్థానం అభివృద్ధికి నిధులు తీసుకురావడం, ఖర్చు చేయడం లాంటి అంశాలతో ట్రస్టుబోర్డు ఆవశ్యకతను జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు గుర్తించారు. అందులో భాగంగానే తాజా నోటిఫికేషన్ జారీ అయ్యింది.
పలువురి ఆసక్తి...
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ పీఠంపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారు, గత ఎన్నికల్లో చేరిన వారు రెండు వర్గాలుగా విడిపోయి తమ ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారు. తమ అధినేతల నుంచి అంగీకారం తీసుకున్నాక దరఖాస్తులు చేసుకునే ఆలోచనలో వారు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వారు బిజీగా ఉన్న వేళ నోటిఫికేషన్ వచ్చి వారం దాటినా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. నేటికీ ఒక్క అప్లికేషన్ కూడా రాలేదని ఎండోమెంట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఉప ఎన్నిక ముగిసినందున ఆశావహులంతా రాజధానికి క్యూ కడుతున్నారు.
