అస్సాంలో ముస్లిం మ్యారేజ్ యాక్ట్ రద్దు: కేబినెట్ ఆమోదం

అస్సాంలో ముస్లిం మ్యారేజ్ యాక్ట్ రద్దు: కేబినెట్ ఆమోదం

గువహటి: అస్సాంలో ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవోర్సెస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1935ని రద్దు చేసేందుకు ఆ రాష్ట్ర కేబినెట్ శుక్రవారం రాత్రి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టేందుకే ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించామని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ‘‘చట్ట ప్రకారం వివాహం చేసుకోవాలంటే వధువుకు 18, వరుడికి 21 ఏండ్లు నిండాలి. కానీ ఇంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్లకు పెండ్లి చేసినా.. ఆ పెండ్లిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ లోని నిబంధనలు అనుమతిస్తాయి.

అందుకే బాల్య వివాహాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం” అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉన్న ముస్లిం మ్యారేజ్ రిజిస్ట్రార్లకు ఈ చట్టం రద్దు అయిన తర్వాత పునరావాసం కోసం రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. అయితే, ప్రభుత్వ నిర్ణయం ముస్లింల పట్ల వివక్షాపూరితంగా ఉందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను పోలరైజ్ చేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించాయి.