- సుప్రీం కోర్టును ఆశ్రయించిన అస్సాం పోలీసులు
న్యూఢిల్లీ, వెలుగు: ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ‘ట్రాన్సిట్ ముందస్తు బెయిల్’ను సవాల్ చేస్తూ అస్సాం పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భుయాన్ శర్మకు వివిధ దేశాల పాస్ పోర్టులు ఉన్నాయంటూ పవన్ ఖేరా చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రిణికి ఫిర్యాదు చేయడంతో గువాహటి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఖేరాపై కేసులు నమోదు చేశారు. అరెస్టు భయంతో పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఈనెల10న విచారణ జరిగింది.
ఈ మేరకు ఖేరాకు వారం రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ, ఆ లోపు గువాహటి హైకోర్టును సంప్రదించాలని సూచించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ అస్సాం పోలీసులు ఈనెల12న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికార పరిధి లేని చోట బెయిల్ మంజూరు చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బుధవారం సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను
విచారించనుంది.

