పదేండ్లుగా అస్సాంలో శాంతి మంత్రం.. బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ

పదేండ్లుగా అస్సాంలో శాంతి మంత్రం.. బీజేపీ బూత్  స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ
  • కాంగ్రెస్ హయాంలో చొరబాట్లకు దారులంటూ ఫైర్

న్యూఢిల్లీ: అస్సాంలో అక్రమ చొరబాటు అనేది కేవలం ఎన్నికల అంశం మాత్రమే కాదని.. అది రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడటానికి, జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరబాటుదారులకు దారులు తెరిచి.. వారి భూములను కట్టబెట్టిందని.. దీంతో వారు స్థానిక ప్రజల జీవనోపాధిని, చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అయితే, గత పదేండ్లలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అస్సాంలో శాంతిని నెలకొల్పడానికి ఎంతో కృషి చేసిందని మోదీ పేర్కొన్నారు. 

ఏప్రిల్​9న అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం.. అస్సాం బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో వర్చువల్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించిన ‘మేరా బూత్, సబ్సే మజబూత్’ కార్యక్రమంలో ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్ కేవలం కాగితాల మీదనే ఒప్పందాలు చేసిందని.. కానీ, బీజేపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో 12 శాంతి ఒప్పందాలను అమలు చేస్తోందని చెప్పారు. ఒకప్పుడు బాంబుల మోతతో దద్దరిల్లిన బోడో ప్రాంతం ఇప్పుడు శాంతికి నమూనాగా మారిందని కొనియాడారు. తొలిసారి ఓటు వేసే యువతకు కాంగ్రెస్ హయాంలోని ‘అస్తవ్యస్త పాలన’ గురించి వివరించాలని, చిన్న పొరపాటు జరిగినా రాష్ట్రం మళ్లీ వెనక్కి వెళ్తుందని హెచ్చరించారు. 

మహిళల సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. లఖ్​పతి దీదీ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల విజయగాథలను డిజిటల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌లలో పంచుకోవాలని కోరారు. టీ తోటల కార్మికులకు భూమి హక్కులు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చామన్నారు. కానీ, బెంగాల్ ప్రభుత్వం కేంద్ర పథకాలను అక్కడి టీ తోటల కార్మికులకు చేరకుండా అడ్డుకుంటోందని విమర్శించారు. 

అలాగే, కార్యకర్తలు ప్రతి బూత్‌‌‌‌‌‌‌‌లో ‘చాయ్ పే చర్చ’ నిర్వహించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఏఐ జనరేటెడ్ (డీప్‌‌‌‌‌‌‌‌ఫేక్) వీడియోల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. బీజేపీ అస్సాంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి.