- ట్రంప్, జేడీ వాన్స్‌కు తప్పిన ముప్పు.. షూటర్ అరెస్ట్
- వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్లో ఘటన..
- భయంతో వణికిపోయి, టేబుళ్ల కింద దాక్కున్న గెస్టులు
- కాల్పుల్లో ఓ భద్రతాధికారికి గాయాలు.. నేను భయపడే వ్యక్తిని కాను: ట్రంప్
- నిందితుడు కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్, పార్ట్‌టైం టీచర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హత్యాయత్నం నుంచి క్షేమంగా బయటపడ్డారు. శనివారం రాత్రి వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్లో వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో తీవ్ర కలకలం రేగింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి, ట్రంప్‌తోపాటు పలువురు మంత్రులు, ఇతర అగ్ర నాయకులను సురక్షితంగా బయటకు తరలించారు. ట్రంప్‌కు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి కాల్పుల్లో ఒక భద్రతాధికారి గాయపడ్డారు.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8:34 గంటలకు హోటల్లోని బాల్ రూంలో డిన్నర్ జరుగుతుండగా, ఒక్కసారిగా బయటి నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది, ఇతర అధికారులు హాల్ లోకి పరుగెత్తుకుంటూ వచ్చి అందరినీ అప్రమత్తం చేశారు. ఆ సమయంలో డిన్నర్ హాల్లో వేదికపై కూర్చున్న వైట్హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీజియా జియాంగ్, మెంటలిస్ట్ ఓజ్ పెర్ల్‌మాన్‌తో ట్రంప్ మాట్లాడుతున్నారు.
ఓజ్ పెర్ల్‌మాన్ ఈ ప్రధాన కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. హెడ్ టేబుల్ వద్ద కూర్చున్న ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సెకండ్ లేడీ ఉషా వాన్స్‌లను, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు క్యాబినెట్ మంత్రులనూ సీక్రెట్ సర్వీస్ అధికారులు, ఇతర భద్రతా సిబ్బంది చుట్టుముట్టి బాల్‌రూమ్ నుంచి బయటకు తీసుకెళ్లారు.
ట్రంప్ భయంతో పరుగెత్తుతూ తడబడి కింద పడిపోగా, వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనను పైకి లేపారు. విందులో ఉన్న వివిధ రాజకీయ పక్షాల నాయకులు, జర్నలిస్టులు, ఇతర ఆహ్వానితులు కాల్పుల శబ్దం వినగానే అప్రమత్తమై టేబుళ్ల కింద దాక్కున్నారు.
హోటల్ వెలుపల నేషనల్ గార్డ్ సభ్యులు, ఇతర అధికారులు ఆ ప్రాంతాన్ని ముట్టడించారు, పైన హెలికాప్టర్లు గస్తీ కాశాయి. కాగా, మీడియాతో అంతగా మంచి సంబంధాలు లేని ట్రంప్ అధ్యక్షుడి హోదాలో వార్షిక వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ విందుకు హాజరుకావడం ఇదే తొలిసారి.
ఎంట్రెన్స్ వద్ద రూంలో దాక్కుని..
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో వాలంటీర్ గా పని చేసిన హెలెన్ మాబస్ అనే మహిళ ప్రత్యక్ష సాక్షిగా ఈ ఘటనకు సంబంధించి కీలక సమాచారం అందించారు. ‘‘టెర్రస్ స్థాయి ప్రవేశ ద్వారం వద్ద తక్కువ నిఘా ఉన్న ప్రాంతంలో షూటర్ ఒక పొడవైన ఆయుధాన్ని అసెంబుల్ చేయడం కనిపించింది. ఆ తర్వాత అతడు బాల్‌రూమ్ వైపు కదులుతూ కాల్పులు జరిపాడు. అంతకుముందు బార్ కార్ట్‌లను నిల్వ చేసే ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఒక తాత్కాలిక గదిలో అతడిని చూశాం. ఆ సమయంలో అక్కడ ఎటువంటి భద్రత లేదు" అని ఆమె చెప్పారు.
‘‘భద్రతా సిబ్బందికి సరిగ్గా కనిపించని ఆ గదిలో ఆ వ్యక్తి ఆయుధాన్ని సిద్ధం చేసుకుని, హఠాత్తుగా ప్రధాన వేదిక వైపు వెళ్లాడు. అతడు దానిని అమర్చి.. బాల్‌రూమ్‌కు వెళ్లే మెట్ల వైపు పరిగెత్తాడు. అక్కడికి చేరుకున్నాక అన్ని వైపులా దాదాపు 10 సార్లు కాల్పులు జరపడంతో అతిథులు, సిబ్బంది పరుగులు తీశారు. అందరూ కేకలు వేస్తూ పరుగులు తీస్తుండగా.. సీక్రెట్ సర్వీస్, ఇతర సాయుధ సిబ్బంది నిందితుడి వైపు దూసుకెళ్లారు. వందలాది మంది ప్రముఖులు ఉన్న బాల్‌రూమ్‌కు వెళ్లే దారికి కొన్ని అడుగుల దూరంలోనే ఈ ఘటన జరిగింది” అని ఆమె వివరించారు.
భద్రతా వలయాన్ని ఎలా దాటాడు?
వైట్ హౌస్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమం ఎన్నో ఏళ్లుగా ఇదే హోటల్ లో జరుగుతోంది. వైట్ హౌస్ కు కిలోమీటరున్నర దూరంలో ఉండే ఈ హోటల్ లో కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమం జరిగే సమయంలోనూ సాధారణ అతిథుల కోసం కూడా తెరిచే ఉంటుంది. భద్రత సాధారణంగా బాల్‌రూమ్ ప్రాంతానికే పరిమితమై ఉంటుంది. విందుకు హాజరుకాకుండా, హోటల్ లో స్టే చేసే ఇతర వ్యక్తులపై తనిఖీలు పెద్దగా ఉండవు. ఇదే అదనుగా తీసుకుని, అతడు హోటల్లోకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది.
భద్రతాపరమైన తనిఖీలు లేని చోట దాక్కుని, వెపన్‌ను సిద్ధం చేసుకుని ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ ట్రంప్ ఉన్న బాల్ రూంవైపు పరుగెత్తాడు. అయితే, భద్రతాధికారులు వెంటనే అడ్డుకోవడంతో ప్రాణ నష్టం తప్పిపోయింది. కాగా, కాల్పులకు పాల్పడిన నిందితుడిని కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన 31 ఏళ్ల కోల్ టోమస్ అలెన్‌గా గుర్తించినట్లు భద్రతా అధికారులు తెలిపారు.
నిందితుడిపై ‘హింసాత్మక నేరానికి తుపాకీని ఉపయోగించడం’, ‘ప్రమాదకరమైన ఆయుధంతో ఫెడరల్ అధికారిపై దాడి చేయడం’ వంటి రెండు అభియోగాలు నమోదు చేశారు. అతడిని సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు చెప్పారు.
నేను భయపడే వ్యక్తిని కాను: ట్రంప్
కాల్పుల ఘటన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది ప్రమాదకరమైన ఉద్యోగమే కానీ, నేను భయపడిపోయే వ్యక్తిని కాదు. ఇది ప్రమాదకరమైన జీవితం అని తెలిసినప్పటికీ, నేను చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను. దీనిని ఎంత బాగా ఎదుర్కోవాలో అంత బాగా ఎదుర్కొంటున్నానని భావిస్తున్నాను" అని చెప్పారు.
"భద్రతా దళాలు గొప్ప పని చేశాయి. అయితే ఈ సాయంత్రం జరిగిన సంఘటనల దృష్ట్యా, అమెరికన్లందరూ తమ విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి హృదయపూర్వకంగా కట్టుబడి ఉండాలని కోరుతున్నాను" అని ట్రంప్ అన్నారు. ఈ కాల్పులకు ఇరాన్ యుద్ధంతో సంబంధం ఉందా? అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. "నేను అలా అనుకోవడం లేదు, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం" అని సమాధానమిచ్చారు. అయితే, ఇరాన్ యుద్ధంలో గెలవకుండా ఇది తనను అడ్డుకోలేదన్నారు. అరెస్టయిన షూటర్ ను ఒక ‘లోన్ వోల్ఫ్’ (ఒంటరిగా దాడికి పాల్పడే వ్యక్తి)గా భావిస్తున్నారని తెలిపారు.
ఆ వ్యక్తి ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌పై కాల్పులు జరిపాడని, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించడం వల్ల ఆ ఏజెంట్ ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు. కాగా, కాల్పుల ఘటన తర్వాత ఈవెంట్ ను రద్దు చేసినట్టు వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు.
కాగా, ట్రంప్ హత్యాయత్నం నుంచి బయటపడటం ఇది మూడోసారి. మొదటిసారి ట్రంప్ 2024 జులై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయనపై ఓ దుండగుడు కాల్పులు జరపగా, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రెండోసారి 2024 సెప్టెంబర్ 15న ఫ్లోరిడాలో ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులకు యత్నించగా అధికారులు అడ్డుకున్నారు.
నిందితుడు ‘నాసా ఫెలో’..
వాషింగ్టన్: డిన్నర్ పార్టీలో కాల్పులు జరిపిన నిందితుడిని కాలిఫోర్నియాకు చెందిన కోల్ థామస్ అలెన్ (31) గా గుర్తించారు. సోషల్ మీడియా ప్రొఫెల్స్ ద్వారా అతడి గుర్తింపును నిర్ధారించారు. అలెన్ మెకానికల్ ఇంజనీర్, కంప్యూటర్ సైంటిస్ట్, ఇండీ గేమ్ డెవలపర్ తో పాటు లాస్ ఏంజెలెస్ లో పార్ట్ టైమ్ టీచర్ గా పనిచేస్తున్నట్లు బయటపడింది.
కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2017లో అతను మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ డొమిన్ గ్వెజ్ హిల్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. అలాగే, ఐజేకే కంట్రోల్స్ లో మెకానికల్ ఇంజనీర్‌గా, కాల్టెక్లో టీచింగ్ అసిస్టెంట్ గా కూడా పనిచేశాడు. కాలేజీ స్టూడెంట్లకు అడ్మిషన్ల కౌన్సెలింగ్, టెస్ట్ ప్రిపరేషన్ సర్వీసెస్ అందించే సీ2 ఎడ్యుకేషన్‌లో పార్ట్ టైం టీచర్ గా పనిచేశాడు. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీలో సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్లోనూ పాల్గొన్నాడు. దీంతో నాసా ఫెలోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి తరపున పోటీచేసిన కమలా హారిస్‌కు 25 డాలర్ల విరాళం ఇచ్చాడు. కాగా, కాల్పులకు పది నిమిషాల ముందు నిందితుడు తన కుటుంబ సభ్యులకు ఓ సందేశం పంపించాడు. అందులో తాను ఎవరెవరిని చంపాలని అనుకుంటున్నది రాశాడు. అవసరమైతే ఆ ప్రోగ్రామ్‌కు హాజరైన వారినీ చంపేందుకు వెనకాడడని చెప్పాడు.
అప్పట్లో రీగన్ పైనా ఇక్కడే దాడి
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ పార్టీలో కాల్పుల ఘటన 45 ఏళ్ల నాటి ఘటనను గుర్తుకు తెచ్చింది. 1981 మార్చిన 30 న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్.. హిల్టన్ హోటల్ కు వచ్చారు. ఇంతలోనే ఓ దుండుగుడు ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరిపాడు. అందరూ చూస్తుండగానే అధ్యక్షుడిపై తూటాల వర్షం కురిపించాడు.
మొత్తం ఆరు రౌండ్లు ఫైరింగ్ చేశాడు. ఒక బుల్లెట్ రీగన్ ఛాతీలోకి దూసుకుపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు నాటి ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ, మరో ముగ్గురు సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. అధ్యక్షుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ హాస్పిటల్ కు తరలించారు. అత్యవసర చికిత్స అందించడంతో రీగన్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనపై కాల్పులు జరిపిన జాన్ హింక్లీ జూనియర్ ను ఘటనా స్థలంలోనే పోలీసులు అరెస్టు చేశారు. అయితే, హింక్లీ మానసిక రోగంతో బాధపడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. తర్వాత కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.
అందరూ వణుకుతుంటే, తింటూ కూసున్నడు..
వైట్ హౌస్ డిన్నర్‌లో కాల్పులు జరుగుతుండగా అందరూ ప్రాణభయంతో వణికిపోతుంటే.. ఒక వ్యక్తి ఏమాత్రం చలించకుండా భోజనం చేస్తూ కూర్చున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్ విపరీతంగా షేర్ అవుతోంది. అతిథులంతా టేబుళ్ల కింద దాక్కుంటూ, భద్రతా సిబ్బంది గదిలో వేగంగా కదులుతుంటే, ఈ ఒక్క వ్యక్తి మాత్రం ప్రశాంతంగా కూర్చుని తింటూ కనిపించాడు. ఉద్రిక్తత మధ్యలో కూడా అతడు అప్పుడప్పుడు పైకి చూస్తూ, ఏమాత్రం కలత చెందకుండా తన పనిలో తాను నిమగ్నం కావడం ఆశ్చర్యానికి గురిచేసింది.

