- గతంలో జరిగిన హత్యలకు ప్రతీకారం తీర్చుకునే ప్లాన్
మల్కాజిగిరి వెలుగు : ఉప్పల్‌లో ఓ వ్యక్తిని చంపేందుకు పన్నిన కుట్రను ఉప్పల్ పోలీసులు, ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్ టీమ్భగ్నం చేసిందని మల్కాజిగిరి సీపీ సుమతి తెలిపారు. సోమవారం మల్కాజ్ గిరి సీపీ ఆఫీసులో ఆమె వివరాలు వెల్లడించారు. పాత కక్షలు, ప్రతీకారంతో అర్ఫాజ్ అనే వ్యక్తిని చంపేందుకు ప్లాన్వేసిన ఐదుగురిని అరెస్టు చేసినట్టు చెప్పారు. రెండు కంట్రీమేడ్ పిస్టల్స్, 8 బుల్లెట్లు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నవంబర్ 2న ఉప్పల్ పోలీసులు, ఎస్‌ఓటీ టీమ్పెట్రోలింగ్ చేస్తుండగా, ఉప్పల్ శిల్పారామం వెనుక ఉన్న మూసీ సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశంలో ఐదుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా, ఇద్దరి దగ్గర రెండు పిస్టల్స్, 8 బుల్లెట్లు, మూడు కత్తులు దొరికాయి.
విచారణలో అర్ఫాజ్ అనే వ్యక్తిని చంపేందుకు కుట్ర పన్నినట్టు చెప్పారు. నిందితులందరికీ గతంలో దాసరి సురేందర్ అలియాస్ సూరితో పరిచయాలున్నాయి. భార్య షబాపై అనుమానంతో సురేందర్ ఆమెను చంపగా, 2024లో ఆమె సోదరుడు సల్మాన్‌ను కూడా హత్య చేశారు. వీటికి ప్రతీకారంగా 2026 జూలైలో షబా మరో సోదరుడు అర్ఫాజ్.. సురేందర్‌ను చంపేశాడు. ఇటీవల అర్ఫాజ్ విడుదల కాగా, సురేందర్ అనుచరులు అతడిని హత్య చేయాలని కుట్ర పన్నారు. బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా సైద్‌పూర్ దబ్రా ప్రాంతం నుంచి రూ.30 వేలకు రెండు కంట్రీమేడ్ పిస్టల్స్, ఆరు బుల్లెట్లు కొన్నారు. నిందితుల్లో భారతీనగర్ కు చెందిన లోన్ రికవరీ ఏజెంట్ అయిన తనయ్ కుమార్ అలియాస్ కన్నా (26), ఆటో డ్రైవర్ మీర్‌పేట షేక్ అక్బర్ (26) బిహార్‌లోని భాగల్‌పూర్ కు చెందిన ఆదిత్య కుమార్ ఠాకూర్ (33), దుడాని లక్ష్మణ్ సింగ్ అలియాస్ సోను (27) ఉన్నారు.
