అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

హైద‌రాబాద్: ‌రాష్ట్ర శాసనసభ వర్షాకాల స‌మావేశాలు ప్రారంభమయ్యాయి. ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి స్టార్ట్ చేశారు. ముందుగా ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డిలకు నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా వారి సేవ‌ల‌ను స‌భ్యులు గుర్తు చేస్తూ మాట్లాడారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో స‌భ్యుల‌తో పాటు అసెంబ్లీ సిబ్బంది సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధ‌రించి హాజరయ్యారు.

కరోనా నిబంధనల మేరకే ఉభయ సభలు 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉభయ సభల నిర్వహణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని నెగిటివ్‌ వచ్చిన వారినే ప్రాంగణంలోకి అనుమ‌తించారు. ఆరుడు అడుగుల దూరం పాటిస్తూ.. ఒక సీట్లో ఒకరే కూర్చొనేలా.. అసెంబ్లీలో అదనంగా 40, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులకు అందరికీ  కరోనా టెస్టులు చేశారు. శానిటైజర్‌ యంత్రాలు, కరోనా వారియర్స్ ను సిద్ధంగా ఉంచారు. మాస్కు ధరించని వారి వివరాలు, వారి ఉష్ణోగ్రతలు ఎప్పుటికప్పుడు తెలిసేలా కెమెరాలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి తీసుకొచ్చే ఫైళ్లను కూడా శానిటైజ్‌ చేసేందుకు ప్రత్యేక మిషిన్లను ఏర్పాటు చేశారు.