- హాజరైన మంత్రులు, ప్రముఖులు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన శాసనమండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం తన చాంబర్ లో పూజలు నిర్వహించారు. వారసత్వ విలువలు దెబ్బతినకుండా, అత్యాధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన ఈ భవనం ఇప్పుడు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.
1905లో రాజస్తాన్, పర్షియన్ శైలిలో నిర్మించిన చారిత్రక టౌన్ హాల్ భవనాన్ని ప్రభుత్వం సుమారు రూ.30 కోట్ల వ్యయంతో ముస్తాబు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత శాసనసభ, మండలి వేర్వేరు భవనాల్లో కొనసాగుతున్నాయి. దీనివల్ల సమన్వయ లోపం ఏర్పడడంతోపాటు కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతున్నది.
ఈ సమస్యను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఉభయ సభలు ఒకే చోట ఉండాలనే సంకల్పంతో ఈ చారిత్రక భవనానికి పునరుద్ధరణ పనులు చేయించారు. ఈ భవనం లోపల పాతకాలపు నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా ఉన్న చెక్కడాలను అలాగే ఉంచి ఆధునిక ఫర్నీచర్‌తో సీటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణా రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అర్థవంతమైన చర్చలకు మండలి వేదిక కావాలి
తెలంగాణ పునర్నిర్మాణంలో ఇదొక కీలక ఘట్టమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభివర్ణించారు. మండలి భవన పునరుద్ధరణ పనులను ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో పర్యవేక్షించడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అర్థవంతమైన చర్చలకు మండలి వేదిక కావాలని ఆకాంక్షించారు. వారసత్వ కట్టడం సహజత్వం దెబ్బతినకుండా ఆధునిక హంగులతో తీర్చిదిద్దడం సవాలుతో కూడుకున్న పని అని, ఆర్ అండ్ బీ మినిస్టర్‌గా ఈ పనిని పర్యవేక్షించడం గర్వంగా ఉందన్నారు.
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే శాసనసభ, శాసనమండలి మధ్య సమన్వయం ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అంటేనే ప్రజల గొంతుకను వినడమని, రెండు సభలు కలిసి పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు.
గవర్నర్‌కు సీఎం వీడ్కోలు..మహారాష్ట్రకు బదిలీపై వెళ్తున్న జిష్ణుదేవ్ వర్మకు సన్మానం
హైదరాబాద్, వెలుగు: ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణకు మధ్య కళలు, సంస్కృతి, సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, ఆవిష్కరణల వంటి అంశాల్లో నిరంతర సహకారం, పరస్పర అవగాహన కోసం తెలంగాణ, -నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ పేరుతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన కృషి అభినందనీయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ఆయనకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతో కలిసి ఆదివారం వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏడాదిన్నర కాలంలో రాష్ట్రానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అందించిన సేవలను గుర్తు చేశారు.
ములుగు ప్రజలు గవర్నర్‌ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాపై ఆయన ప్రత్యేక అభిమానం చూపించారని పేర్కొన్నారు. మూడుసార్లు ములుగు నియోజకవర్గంలో పర్యటించడమే కాకుండా కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకొని, అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.
ముఖ్యంగా కారంపొడి, పసుపు మిల్లులు ఏర్పాటు చేయించి, మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచారన్నారు. గవర్నర్ ప్రోత్సాహంతో కొండపర్తి మహిళా సంఘం సభ్యులు ఇప్పపువ్వు లడ్డూలు తయారు చేస్తున్నారని, ఇటీవల సమ్మక్క, సారలమ్మ జాతరలో వాటిని విక్రయించి మంచి ఆదాయం పొందారని తెలిపారు.
సీతక్క.. వెరీ యాక్టివ్ లేడీమంత్రి సీతక్కను వెరీ యాక్టివ్ లేడీ అని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అభినందించారు. ప్రజలకు ఇలాగే సేవ చేయాలని సూచించారు. అనంతరం మంత్రి ఆయనకు సమ్మక్క, సారలమ్మ జాతర జ్ఞాపికను అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ సతీమణికి తెలంగాణ సంప్రదాయ చీరను బహూకరించారు. అనంతరం గవర్నర్ ప్రిన్సిపల్సెక్రటరీ దాన కిశోర్, రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది గవర్నర్ దంపతులను సన్మానించారు.
