సభను ఇలా జరపడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

సభను ఇలా జరపడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

శాసనసభ పూర్తిగా అప్రజాస్వామికంగా నడుస్తోందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పాయింట్ ఆఫ్ లేవనెత్తడానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పీకర్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద సహచర ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్దిలతో కలసి మీడియాతో మాట్లాడారు. స్పీకర్ కనీస మర్యాద పాటించలేదని.. ప్రశ్నించినందుకు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారన్నారు. తాము వాకౌట్ చేసేలా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. తమ నిరసన తెలియజేయడానికి కూడా కనీసం మైక్ ఇవ్వలేదని ఆరోపించారు. అసెంబ్లీని టీఆర్ఎస్  పార్టీ కార్యాలయంగా మార్చారని విమర్శించారు భట్టి విక్రమార్క. 
‘నిబంధనలకు విరుద్ధంగా.. సభా గౌరవాన్ని మంట కలుపుతూ నడుస్తునన్న సభ ఇది.. ఒక ఫ్లోర్ లీడర్ గా.. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి.. పదే పదే గొంతుపోయేంత వరకు అరచినా కనీసం బాధ్యత కలిగిన ఉన్నత స్థానంలో ఉన్న సభాపతి ఒక్క సారైనా మా వైపు చూడకపోవడం సిగ్గుచేట్టన్నారు. సభాపతి స్థానంలో ఉన్న వారు సభ్యులు ఎవరైనా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెబితే.. వెంటనే స్పందించి మీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటి.. ఏ రూల్ కింద పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్పండి.. కూర్చోండి.. మైక్ ఇస్తా.. మాట్లాడండి... వంటి కనీస మర్యాద ఇవ్వాల్సి ఉంటే.. ఈ సభలో మేం తప్ప ఎవరూ ఉండకూడదన్నట్లు ప్రవర్తిస్తే ఎట్లా..’ అని భట్టి విక్రమార్క మండిపడ్డారు. 
‘ఇది చట్ట సభనా..? టీఆర్ఎస్ ఆఫీసా.. ? కేవలం వాళ్ల రాజకీయ పార్టీ కార్యాలయం లాగా.. వాళ్లకు మద్దతిచ్చే వారినే పక్కన కూర్చోబెట్టుకుని..వారితోనే మాట్లాడుతూ.. వారికే అవకాశాలిస్తూ.. మిగతా వారిని సస్పెండ్ చేశారు. మేం మైక్ అడిగితే.. కనీసం మైక్ కూడా ఇవ్వరు.. ఇదెక్కడి అన్యాయం.. ఇదెక్కడి విధానం.. ఇది కాదు సభ నడపడం.. మీ ఇష్టం వచ్చినట్లు సభ నడపాలని.. సభలో ఉన్న సభ్యుల హక్కులను కాలరాస్తూ.. సభా నిబంధనలను కాలరాస్తూ.. తుంగలో తొక్కుతుంటే.. చూస్తూ ఊరుకోలేం.. మాట్లాడకుండా ఉండలేం.. నిబంధనలకు అనుగుణంగా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతాం.. మేం ఏం చేసినా నడుస్తుంది.. మేం సభ ఎట్లైనా నడుపుకుంటామనడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.. చాలా ఆవేదనతో చెబుతున్నా..ఇదెక్కడి విధానం.. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా..’ అని భట్టి విక్రమార్క అన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్