ఆగస్టు తొలి వారంలో ..అసెంబ్లీ సమావేశాలు!

ఆగస్టు తొలి వారంలో ..అసెంబ్లీ సమావేశాలు!

 

  • ఆగస్టు తొలి వారంలో ..అసెంబ్లీ సమావేశాలు!
  • ఐదు నుంచి ఏడు రోజులపాటు జరిపే చాన్స్​
  • సెకెండ్​ టర్మ్​ పాలనలో అసెంబ్లీకి ఇదే చివరి సెషన్
  • ఎన్నికలే ఎజెండాగా సమావేశాలు నిర్వహించేలా ప్లాన్
  • ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడానికే ప్రాధాన్యం

హైదరాబాద్, వెలుగు: ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈసారి ఐదు నుంచి ఏడు రోజుల పాటు సభ నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ రెండో అసెంబ్లీకి ఇదే చివరి సెషన్ ​కావడంతో ప్రభుత్వ ప్రగతిని చెప్పుకునేందుకు ఈ సమావేశాలను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో సర్కారు ఉంది. యూనిఫాం సివిల్​కోడ్ (యూసీసీ), మణిపూర్ ​మారణకాండను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయనున్నట్టు తెలిసింది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి 12న ముగిసింది. సెషన్ చివరి వర్కింగ్​ డే నుంచి ఆరు నెలల్లోపు అసెంబ్లీని సమావేశపరచాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆగస్టు 11లోపు సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో అందుకు నాలుగైదు రోజుల ముందే అసెంబ్లీ ప్రారంభమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ప్రతిపక్షాలను కార్నర్ చేసేలా..

రాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితి డిసెంబర్‌‌తో ముగియనుంది. అక్టోబర్ మూడో వారంలోనే అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశముందని అంచనా ఉన్నాయి. ఎన్నికలకు ముందు నిర్వహించే సెషన్​కావడంతో నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ప్రజల కోసం ఏమేం చేసిందో చెప్పుకోవడంపైనే సర్కారు దృష్టి పెట్టగా.. ఇప్పటికే ఆయా శాఖలు కసరత్తు మొదలు పెట్టాయి. సమావేశాల మొదటి రోజు కంటోన్మెంట్​ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపంగా తీర్మానం ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఆయనకు నివాళి అర్పించిన తర్వాత సభ వాయిదా పడుతుంది. మరుసటి రోజు నుంచి బీఆర్ఎస్​ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సభలో చర్చిస్తారు. ఇప్పటికే ఇందుకు అవసరమైన ఎజెండా సిద్ధం చేశారని తెలుస్తున్నది. రైతులకు 24 గంటల కరెంట్, ఇరిగేషన్​ప్రాజెక్టులు, దళితబంధు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, హెల్త్, ఎడ్యుకేషన్, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాలు సహా ఇతర కీలక అంశాలపై సభలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోనున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్​ పార్టీని, బీజేపీని కార్నర్ చేసేలా సమాచారం సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశాల్లోనే యూసీసీ, మణిపూర్​ మారణకాండతో పాటు బీసీ జనాభా లెక్కలు చేపట్టాలని కూడా తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతారని సమాచారం.