
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ తొలిరోజు ఆరు నిమిషాల్లోనే ముగిసింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు సభ ప్రారంభం కాగానే.. కరోనా టైమ్ లో ఫిజికల్ డిస్టెన్స్ తో కూర్చునేలా ఏర్పాట్లు చేయగా, గతంలో ఉన్నట్లు పాత సీట్లలోనే కూర్చోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత డీఎస్ రెడ్యానాయక్, హన్మంత్ షిండే, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మహ్మద్ మొజంఖాన్ ను ప్యానల్ స్పీకర్లుగా నియమిస్తూ స్పీకర్ ప్రకటన చేశారు. టీఎస్ఎన్ పీడీసీఎల్ 2020–21 ఏడాదికి 21వ యాన్యువల్ రిపోర్ట్ ను, 2020–21 ఏడాదికి 4వ యాన్యువల్ రిపోర్ట్ ను, గత నెల 16న హోం శాఖ ఇచ్చిన జీవో ఎంఎస్ 42లోని తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రూల్ బుక్ 2005 ను సభలో ఉంచుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం, కరీంనగర్ జిల్లా కమాలపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్ రెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తూ అసెంబ్లీ 2 నిమిషాలు మౌనం పాటించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మల్లు స్వరాజ్యం 1945 నుంచి 1948 వరకు సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారని, సాయుధ పోరాటంలో తుపాకి పట్టిన తొలి మహిళ ఆమే అని స్పీకర్ చెప్పారు. 1978, 1983లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారని, 1981 నుంచి 2002 వరకు ఏపీ మహిళ సంఘంలో చురుకుగా పాల్గొని, అధ్యక్షురాలిగా పనిచేశారన్నారు. జనార్దన్ రెడ్డి.. కమలాపూర్ నుంచి రెండుసార్లు ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారన్నారు. జమ్మికుంట లో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయ రంగ అభివృద్ధికి పనిచేశారని గుర్తు చేశారు. అనంతరం ఈ నెల 12 ఉదయం 10 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
కేటీఆర్, ఈటలకు పరామర్శ
ఇటీవల కరోనా నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్ కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పరామర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈటల సీటు దగ్గరకు వచ్చి పరామర్శించారు.
గుజరాత్ మొత్తం కేసీఆర్ ఫొటోలే పెట్టాలె
రేషన్ షాపుల దగ్గర ప్రధాని మోడీ ఫొటోలు పెట్టడం కాదు.. నిజంగా ఫొటోలు పెట్టాల్సి వస్తే గుజరాత్ మొత్తం సీఎం కేసీఆర్ ఫొటోలు పెట్టాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత లాబీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. మోడీ సర్కారు అదానీకి పెట్టిన డబ్బులన్నీ తెలంగాణ ప్రజల రక్తమేనన్నారు. దేశానికి అత్యధిక జీఎస్టీ కట్టేదే తెలంగాణ అని అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ షాపుల దగ్గరికెళ్లడం దిగజారుడు రాజకీయమన్నారు. ఇలాంటివి మానుకోవాలని అన్నారు.
మునుగోడులో ఉప ఎన్నికలో గెలిచేది మేమే
మునుగోడులో గెలిచేది తామేనని హుజూర్‌న గర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఈటల రాజేందర్‌కు ఉన్నంత పలు కుబడి, సెంటిమెంట్ రాజగోపాల్‌రెడ్డికి లేవ న్నారు. పాల్వాయి స్రవంతికి టికెట్ ఇస్తే కాంగ్రెస్‌కు 10వేల ఓట్లు రావడం కష్టమేనని తెలిపారు. అభ్యర్థిని బట్టి కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందా.. మూడో ప్లేస్‌లో ఉం టుందా అనేది తెలుస్తుందన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్క రోజు కూడా నియోజకవర్గంలో బస చేయలేదన్నారు.
ఎంత మంది ఉంటే బీఏసీకి పిలుస్తరు?
అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో బీజేపీకి చాన్స్ ఇవ్వాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత స్పీకర్ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తర్వాత లాబీలో ఆయన మాట్లాడారు. స్టేట్ బీజేపీలో రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన్ను బీఏసీకి పిలిచేవారని, ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలున్నా పిలవడం లేదన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలుంటే బీఏసీకి పిలుస్తారో చెప్తే, ఈ టెన్యూర్‌లో అంత మందిని తెచ్చుకుంటామన్నారు. ఎమ్మెల్యేలకు తెలియకుండా అసెంబ్లీ ఎజెండా ఫిక్స్ చేయొవద్దని కోరానని తెలిపారు.