
వరంగల్, వెలుగు: ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్, కవి, రచయిత డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ భారతీయ భాషా సమ్మాన్ యువ పురస్కారం-– 2025 అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో భారతీయ భాషా పరిషత్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో తెలుగు భాష నుంచి ఆదినారాయణకు అవార్డును ముఖ్య అతిథిగా హాజరైన మాజీ వీసీ ప్రొఫెసర్ అనురాధ లోహియా అందజేశారు. తెలుగు భాష, సాహిత్యంలో ఆదినారాయణ చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తిదాయకమని, సాహిత్య సేవలకు గుర్తింపుగా నిలుస్తుందని భారతీయ భాషా పరిషత్ పేర్కొంది.
కార్యక్రమంలో భారతీయ భాషా పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కుసుమ్ ఖేమాని, డైరెక్టర్ శ్రీ శంభునాథ్, ఉపాధ్యక్షుడు ప్రదీప్ చోప్రా, సుశీల్ కాంతి తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. తెలుగు భాషా పరిశోధన, సాహిత్య రంగాల్లో చేసిన కృషికి ఆయన అవార్డుకు ఎంపికయ్యారు.
కవిగా, రచయితగా గుర్తింపు పొందిన ఆదినారాయణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలకు చెందినవారు. ఆయన హెచ్ సీయూలో హైదరాబాద్ దళితుల ఆత్మకథలపై డాక్టరేట్, ఆచార్య కొలకలూరి ఇనాక్ ‘ఆది ఆంధ్రుడు’ కావ్యంపై ఎం.ఫిల్ పూర్తి చేశారు.‘నానీల సుగంధం’ పేరుతో కవితా సంపుటిని ప్రచురించారు. యూజీసీ కేర్ లిస్టెడ్ పరిశోధన పత్రికలతో పాటు దిన, మాస పత్రికల్లో అనేక వ్యాసాలు, కవితలు రాశారు.