వైరల్ వీడియో: ఎత్తైన కోటను ఈజీగా ఎక్కిన 68 ఏళ్ల బామ్మ

వైరల్ వీడియో: ఎత్తైన కోటను ఈజీగా ఎక్కిన 68 ఏళ్ల బామ్మ

ముంబై: వయస్సు పైబడుతున్నప్పుడు శరీరంలో మునుపటి శక్తి, పటిమ తగ్గిపోతుంటుందని డాక్టర్లు చెబుతుంటారు. అందుకే చాలా మంది వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సాహసాలు చెయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఎక్కువగా శారీరక శ్రమ చేయాల్సి ఉంటే వెనుకంజ వేస్తారు. అయితే మహారాష్ట్రకు చెందిన 68 ఏళ్ల ఆశా అంబాడే అనే బామ్మ మాత్రం దీనికి పూర్తిగా మినహాయింపనే చెప్పాలి. మహారాష్ట్రలోని నాసిక్‌‌కు 40 కి.మీ.ల దూరంలో ఉన్న అత్యంత ఎత్తయిన హరిహర్ కోటపైకి చేరుకోవాలంటే నిటారుగా ఉన్న మెట్లను ఎక్కాల్సిందే. ఈ మెట్లను ఎక్కడానికి యువకులే భయపడతారు. అలాంటిది ఆశా అంబాడే వృద్ధాప్యంలోనూ పట్టుదలగా కోటపైకి చేరుకొని వయస్సు అంటే కేవలం అంకెలేనని నిరూపించింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆఖరుకు దుర్గం పైకి చేరుకుంది. ఈ ఫీట్‌‌కు సంబంధించిన 1.57 నిమిషాల వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. బామ్మ మెట్లు ఎక్కుతున్నప్పుడు చాలా మంది యువకులు ఆమెను ఉత్సాహపరుస్తూ, ప్రోత్సహిస్తూ కనిపించారు. కోటను ఎలాగైనా చేరుకోవాలని ఆశా అంబాడే చూపిన తెగువ, మనోధైర్యం, నిబద్ధత అందర్నీ ఆకట్టుకుంటోంది.